వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై చంద్రబాబు భారీ కుట్రకు తెరలేపారు. అయితే షర్మిల పసిగట్టి వాటిని తిప్పి కొట్టారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతల్ని షర్మిలకు అప్పగించి, తద్వారా వైఎస్ జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు భారీ ఎత్తుగడే వేశారు. బాబు కుట్రకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనవంతు సహకరించి, గురుభక్తిని చాటుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు అనుకున్నట్టు ఏదీ జరగడం లేదు. మరోవైపు షర్మిలపై రేవంత్‌రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే ఆంధ్రా నేత అనే కామెంట్స్ చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. షర్మిలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కాంగ్రెస్ తరపున పని చేయకూడదనేది టీపీసీసీలోని తెలుగుదేశం అనుకూల నేతల వ్యూహంగా చెబుతున్నారు.
తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి, సీతక్క తదితర నేతలు నిత్యం చంద్రబాబు నామస్మరణ చేయడాన్ని అసలైన కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. సీతక్క, రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఇప్పటికీ చంద్రబాబు ఫొటోలుంటాయని, ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆయనపై ప్రశంసలు కురిపించడానికి వెనుకాడని విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
షర్మిల ఏపీకి చెందిన నేత అంటూ తెలంగాణలో పని చేయడానికి అడ్డంకులు చెబుతున్న రేవంత్‌రెడ్డి, సీతక్క తదితర నేతలు, అదే ఆంధ్రా ప్రాంతానికి చెందిన చంద్రబాబును మాత్రం దైవంగా ఎందుకు ఆరాధిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం వుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో షర్మిలను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ప్రాంతాలను తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు తనను పంపి, అక్కడ తన అన్న వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసే దురుద్దేశాలను పసిగట్టడం వల్లే షర్మిల తెలివిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అందుకే షర్మిల తన రాజకీయ భవిష్యత్ తెలంగాణలోనే ముడిపడి వుందని కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పారని వైఎస్సార్‌టీపీ నేతలు స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి కుట్రలకు తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతినే ప్రమాదం వుందనే ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికీ చంద్రబాబు నీడ నుంచి రేవంత్‌రెడ్డి బయటపడడం లేదని, ఇంకా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ను బలి పెడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిలను ఇరకాటంలో నెట్టే క్రమంలో రివర్స్ అయ్యే ప్రమాదం వుందని అంటున్నారు.