టాలీవుడ్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా వుందీ అంటే..నాన్ థియేటర్ బిజినెస్ పూర్తయితే ఆనందం. అదే బిజినెస్ తో సినిమా ఖర్చు మొత్తం రికవరీ అయితే పరమానందం. ఎందుకంటే థియేటర్ ఆదాయం అన్నది లాటరీ గా మారిపోయంది.
ఓపెనింగ్స్ అన్నవి అన్ని సినిమాలకు రావడం లేదు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే నిర్మాత ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈవారం విడుదలయ్యే ‘అన్నీ మంచి శకునములే’ సినిమాకు నాన్ థియేటర్ బిజినెస్ మంచి హొప్ నే ఇచ్చింది.
సినిమాకు అన్నీ కలిపి 22 నుంచి 23 కోట్లు ఖర్చయిందని భోగట్టా. ఇది కాస్త నమ్మలేని ఫిగర్ నే. ఎందుకంటే సంతోష్ శోభన్ హీరోగా అన్ని కోట్లు ఎవరు పెడతారు అనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే వైజయంతీ/స్వప్న సినిమాస్ నిర్మాణం కాబట్టి, విపరీతమైన సపోర్టింగ్ కాస్టింగ్, టెక్నికల్ సపోర్ట్ సమకూర్చారు. దానివల్ల ఖర్చు దాదాపు 18 కోట్ల మేరకు చేరిందని భోగట్టా. ఆపై ప్రింట్, పబ్లిసిటీ, వడ్డీలు సరేసరి.
అయితే ఇక్కడ లక్ ఫ్యాక్టర్ ఏమిటంటే 21.5 కోట్ల మేరకు నాన్ థియేటర్ మీద వచ్చేయడం. మహానటి, సీతారామం వంటి హిట్ ట్రాక్ వుండడం వల్ల కావచ్చు, ప్రాజెక్ట్ కే లాంటి భారీ సినిమా వుండడం వల్ల కావచ్చు మొత్తం మీద టోటల్ రికవరీ నాన్ థియేటర్ మీద వచ్చేసింది. ఇప్పుడు సినిమాను నేరుగా నిర్మాతే పంపిణీ చేసుకుంటున్నారు.
నందినీ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇది ‘అన్నీ మంచి శకునములే’ అని అనుకోవచ్చు.