టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి అఖిలప్రియను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ పాదయాత్ర నంద్యాలో ప్రవేశించిన సందర్భంలో ఏవీ సుబ్బారెడ్డిపై ఓ పథకం అఖిలప్రియ వర్గం దాడికి పాల్పడిందన్న ప్రచారం జరుగుతోంది.
ఏవీ సుబ్బారెడ్డిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ, తన్నుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే మాజీ మంత్రి అఖిలప్రియ నడిరోడ్డుపై పరుగులు పెడుతూ డైరెక్షన్స్ ఇస్తున్నట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.
తనపై అఖిలప్రియ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం అఖిలప్రియను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. లోకేశ్ పాదయాత్ర శుభమా అని నంద్యాలలో అడుగు పెట్టగానే అఖిలప్రియ అరెస్ట్ జరగడం గమనార్హం.
ఇదిలా వుండగా అఖిలప్రియ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ పాదయాత్రలో సొంత పార్టీ నేతపై దాడికి పాల్పడడం ఏంటనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. గతంలో హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హత్యాయత్నం కేసులో అరెస్ట్ కావడం గమనార్హం.