ఆంధ్రజ్యోతి పత్రిక ఒక్కోసారి అమాయకత్వంతో నిజాల్ని భయపెడుతుంటోంది. తాజాగా రాజధాని ప్రాంతంలో పేదలకు సెంటు చొప్పు దాదాపు 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా రాజధాని చుట్టు పక్కలున్న 50వేల కుటుంబాలు విలువైన రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాలను దక్కించుకోనున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు అక్కడ నివాస స్థలాలు దక్కనివ్వకుండా చేయాలని అమరావతి అనుకూలవాదులు న్యాయపోరాటానికి దిగారు.
అయితే వారిది అన్యాయ పోరాటం అని న్యాయస్థానాలు తమ తీర్పులతో చెప్పకనే చెప్పాయి. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే, అక్కడ తమ భూములకు రేట్లు రావనే భయంతోనే అడ్డుకుంటున్నారని ఇంత కాలం అనుకున్నాం. అయితే అంతకు మించి వారి భయమే మరొకటి వుందని ఆంధ్రజ్యోతి కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది. 50 వేల పేద కుటుంబాలకు పొరపాటున రాజధాని ప్రాంతంలో నివాస స్థలం ఇస్తే, ఇక వారంతా వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్‌గా తయారవుతారని, ముఖ్యంగా నారా లోకేశ్ ఓడిపోవడం ఖాయమని తాజా కథనంలో బోరుమని ఏడ్వడాన్ని చూడొచ్చు.
పేదలకు ఇంటి స్థలాలను అడ్డుకోవడం వెనుక రాజకీయ కోణం ఏ రేంజ్లో వుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ఆలోచనల్ని ప్రతిబింబించేలా సదరు పత్రికలో ప్రతి అక్షరం వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నారా లోకేశ్‌ను ఓడించడమే ధ్యేయంగా పేదలకు ఇంటి స్థలాలు ఇస్తున్నారనేది ఆ కథనం ఆరోపణ. ఔను, అధికార పక్షానికి తన ప్రధాన ప్రత్యర్థులను ఓడించడమే లక్ష్యం. పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు కాకుండా మరేం వుంటాయ్? వైసీపీకి కూడా అంతకు భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు వుంటాయని అనుకున్న వాళ్లదే తప్ప, వాళ్లది తప్పు ఎలా అవుతుంది?
‘రాజధాని ప్రాంతంలో ‘ఇతర ప్రాంతాల’ పేదలకు సెంటు పట్టాలు ఎందుకు ఇస్తున్నట్లు? అది కూడా, ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గ పరిధినే ఎందుకు ఎంచుకున్నట్లు?’ అని ప్రశ్నిస్తూ, తానే సమాధానం కూడా ఇవ్వడం ఆంధ్రజ్యోతి ప్రత్యేకత. ఇందులో విశేషం ఏమంటే ఇతర ప్రాంతాల పేదలకు అని అంటూనే, వారంతా రాజధాని పరిధిలోని మంగళగిరి నియోజకవర్గానికి , అలాగే విజయవాడ పేదలని చెప్పడం విశేషం. ఈ కథనంలో పేర్కొన్న ప్రకారం వైసీపీ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో లోకేశ్‌ను ఓడించేందుకు రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఎల్లో బ్యాచ్ లెక్కేంటో చూద్దాం.
మంగళగిరి నియోజకవర్గంలో 2.74 లక్షల మంది ఓటర్లున్నారు. 46వేల సెంటు స్థలాల్లో 35వేలు కేవలం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనే ఏర్పాటు చేశారు. 35 వేల కుటుంబాల్లో ఇంటికి రెండు ఓట్లు వేసుకున్నా కనీసం 70 వేల ఓట్లు వుంటాయి. రాజధాని ప్రాంతంలో ఖరీదైన నివాస స్థలం ఇచ్చామని, తమకు ఓటు వేయాలని వైసీపీ కోరుతుంది. పేదలు కావడంతో వారికి విశ్వాసం వుంటుంది. దీంతో గంపగుత్తగా పేదలంతా వైసీపీకి ఓట్లు వేస్తారు. దీంతో రాజధాని ప్రాంతంలో అది కూడా, చంద్రబాబు వారసుడిని రెండోసారి ఎలాగైనా ఓడిస్తారనే భయం వారిని వెంటాడుతోంది.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తున్న నేపథ్యంలో లోకేశ్ మరొక నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే మొండిగా అక్కడే పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం. దీంతో శాశ్వతంగా తన రాజకీయానికి సమాధి కట్టుకున్నట్టు అవుతుంది. తద్వారా చంద్రబాబు కుమారుడిని కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా రాజకీయ భవిష్యత్‌కు చరమ గీతం పాడిన ఘనత జగన్‌కు దక్కుతుంది.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకోవడం వెనుక ఇన్ని భయాలు, ఆలోచనలున్నాయని ఆంధ్రజ్యోతి పత్రిక నేరుగానే వెల్లడించింది. ఇంత కాలం రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు వద్దని చెబుతున్న వాదనలన్నీ పచ్చి అబద్ధాలని తాజా కథనం చెప్పకనే చెప్పింది.