చేజేతులా ఆమె పొలిటిక‌ల్ కెరీర్ నాశ‌నం!

మాజీ మంత్రి, ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ త‌న రాజ‌కీయ జీవితాన్ని చేజేతులా నాశ‌నం చేసుకుంటున్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇప్ప‌టికే అఖిల‌ప్రియ‌పై చంద్ర‌బాబునాయుడు చాలా అస‌హ‌నంగా ఉన్నారు. నిన్న నంద్యాలలో…

మాజీ మంత్రి, ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ త‌న రాజ‌కీయ జీవితాన్ని చేజేతులా నాశ‌నం చేసుకుంటున్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇప్ప‌టికే అఖిల‌ప్రియ‌పై చంద్ర‌బాబునాయుడు చాలా అస‌హ‌నంగా ఉన్నారు. నిన్న నంద్యాలలో లోకేశ్ పాద‌యాత్ర ప్ర‌వేశించిన సంద‌ర్భంలో, అఖిల‌ప్రియ మార్క్ రాజ‌కీయానికి తెర‌లేవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హ‌త్యాయ‌త్నం కేసులో ఉద‌యం 7.30 గంట‌ల‌కు అఖిల‌ప్రియ అరెస్ట్ కావ‌డం గ‌మ‌నార్హం. అది కూడా సొంత పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, త‌న తండ్రి భూమా నాగిరెడ్డికి ఆత్మ‌గా చెప్పుకునే ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేయ‌డం తీవ్ర సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

ఇదే ఏవీ సుబ్బారెడ్డిపై హ‌త్య‌కు అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్ ప‌థ‌కం వేశార‌ని, దాన్ని క‌డ‌ప పోలీసులు ఛేదించారు. అప్ప‌ట్లోనే అఖిల‌ప్రియ భ‌ర్త‌, అత‌ని స్నేహితుడు గుంటూరు శీనుపై కేసు న‌మోదైంది. ఈ కేసులో ప‌లుమార్లు అఖిల‌ప్రియ‌తో నిందితులు ఫోన్లో మాట్లాడిన‌ట్టు పోలీసులు బ‌య‌ట‌పెట్టారు. అప్పుడే చ‌ర్య‌లు తీసుకుని వుంటే ఈ రోజు లోకేశ్ స‌మ‌క్షంలో ఏవీపై హ‌త్యాయ‌త్నం చేసే ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అఖిల‌ప్రియ వ్య‌వ‌హార‌శైలిపై ముఖ్యంగా చంద్ర‌బాబునాయుడు, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా టీడీపీ నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. హైద‌రాబాద్‌లో ఆస్తుల గొడ‌వ‌ల్లో ఏకంగా ఇన్‌క‌మ్‌ట్యాక్స్ అధికారుల వేష‌ధార‌ణ‌లో హైకోర్టు లాయ‌ర్ల‌నే కిడ్నాప్ చేసి, భ‌య‌పెట్టి సంత‌కాలు చేయించుకున్న ఘ‌ట‌న‌లో అఖిల‌ప్రియ అరెస్ట్ కావ‌డం టీడీపీకి బాగా డ్యామేజీ అయ్యింది. నాడు అఖిల‌ప్రియ జైల్లో వున్న‌ప్పుడు ఏ ఒక్క టీడీపీ ముఖ్య నాయ‌కుడు క‌నీసం ప‌రామ‌ర్శించిన పాపాన కూడా పోలేదు.

ఆ త‌ర్వాత ఆళ్ల‌గ‌డ్డ‌లో వార‌సుల భూవ్య‌వ‌హారాల్లో కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించడం, ఫోర్జ‌రీ సంత‌కాలు చేయించ‌డం లాంటివి అఖిల‌ప్రియ‌, ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌, త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్ ద‌గ్గ‌రుండి చేశార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఆళ్ల‌గ‌డ్డ బీజేపీ ఇన్‌చార్జ్ భూమా కిశోర్‌రెడ్డి త‌న చిన్నాన్న చిన్న‌మ్మ భూమా నాగిరెడ్డి, శోభ‌మ్మ విగ్ర‌హాల‌ను సొంత ఖర్చుల‌తో ఏర్పాటు చేసి, వాటిని ఆవిష్క‌రించేందుకు సిద్ధంగా ఉంచుకోగా, ఆహ్వానం లేకుండానే అఖిల‌ప్రియ త‌న మందీమార్బ‌లంతో వెళ్లి ఓపెనింగ్ చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఇటీవ‌ల ఓ ముస్లిం వ్య‌క్తిని స్థ‌లం వివాదంలో ఇంటికి పిలిపించుకుని, అత‌ని ద‌గ్గ‌రున్న రూ.1.35 కోట్ల‌ను లాక్కుని, త‌న్ని త‌రిమేశార‌ని ఉమ్మ‌డి కర్నూలు జిల్లాలో క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటున్నారు. ఇలా అనేక వివాదాల్లో త‌ల‌దూర్చి ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను సంపాదించుకున్నారు. రాజ‌కీయంగా ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న అఖిల‌ప్రియ త‌న‌కు తానుగానే నాశ‌నం చేసుకుంటున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అఖిల‌ప్రియ అంటే కిడ్నాప్‌లు, హ‌త్యాయ‌త్నాలు, దౌర్జ‌న్యాలు, భూఆక్ర‌మ‌ణ‌లు చేసే నాయ‌కురాలిగా మాత్ర‌మే ప్ర‌జ‌లు గుర్తిస్తున్నారు. ఆమె అంటే ప్ర‌జ‌లు నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌లో భ‌య‌ప‌డే ప‌రిస్థితి. అఖిల‌ప్రియ ఎఫెక్ట్‌తో భూమా అనే ఇంటి పేరు వింటే వ‌ణికిపోయే ప‌రిస్థితి. వీళ్ల కంటే ఎవ‌రైనా బాగుంటుంద‌ని, కోరి కొరివితో త‌ల గోక్కున్న‌ట్టే అనే ప‌రిస్థితి నంద్యాల జిల్లాలో నెల‌కుంది.

ఇదిలా వుండ‌గా ఏవీపై అఖిల‌ప్రియ దాడిపై వైసీపీ శ్రేణులు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యంగ్య పోస్టులు పెడుతున్నారు. టికెట్ ఇవ్వ‌ని లోకేశ్‌పై దాడి చేయాలే కానీ, త‌న‌పై చేస్తే ఎట్లా అని అఖిల‌ను ఏవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం విశేషం. క‌ర్నూలు జిల్లా టీడీపీలో తాజా ప‌రిణామాల‌పై వైసీపీ మాత్రం ఖుషీగా ఉంది. టీడీపీని ఓడించ‌డానికి త‌మ అవ‌స‌రం లేకుండా, వాళ్ల‌లో వాళ్లే కొట్టుకుని చ‌స్తున్నార‌ని, చంద్ర‌బాబు జ‌న్మ‌లో పంచాయితీ తెంచ‌లేర‌ని వారు అంటున్నారు.