డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్కూల్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. వరస విజయాలు అతడికి ఊపును ఇచ్చాయి. ఇతడి తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఎక్కడ తేలుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి విషయంలో గత సంక్రాంతి సినిమా అంతటి ఊపు అయితే ఈ సినిమా విషయంలో కనిపించడం లేదని స్పష్టం అవుతోంది. ఎఫ్ 2 ఫార్ములాలోనే సరిలేరులో కొన్ని సీన్లను పెట్టడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఇతడి తదుపరి సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ లేదా రీమేక్ అని స్పష్టం అవుతోంది. అలా మరీ ఒకే జోనర్ కు ఈ దర్శకుడు ఫిక్స్ అయిపోతాడేమో చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. అనిల్ రావిపూడి నటుడిగా ట్రై చేసుకోవచ్చేమో అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తన సినిమాల్లో ఎండింగ్ టైటిల్ రోల్స్ లో కనిపిస్తూ అనిల్ రావిపూడి ఇప్పటికే తన ముచ్చటను తీర్చుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఇక సరిలేరు ప్రమోషనల్ వీడియోల్లో అనిల్ రావిపూడి తన నటనా స్కిల్స్ ను చాటుకుంటూ ఉన్నాడు.
హీరో మహేశ్ బాబును కూడా సరదాగా అనుకరిస్తూ ఉన్నాడు. మరోవైపు ఈ సినిమా హీరోయిన్ రష్మిక అయితే.. ప్రతి సీన్ నూ దర్శకుడు అనిల్ నటించి చూపించాడని చెబుతోంది. హీరోయిన్ ఎలా నటించాలో కూడా అనిల్ రావిపూడే నటించి చూపించాడట! స్వయంగా ఆ సినిమా హీరోయినే చెప్పిన మాట ఇది. ఇదంతా చూస్తుంటే.. అనిల్ రావిపూడి అతి త్వరలోనే నటన మీదా దృష్టి పెట్టి తెరమీదకు వచ్చేస్తాడేమో అనే అభిప్రాయాలకు ఆస్కారం ఏర్పడుతోంది.