కంటెంట్ బాగుంటే ఎంత పెద్ద నిడివి సినిమానైనా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, మూవీని హిట్ చేస్తారు. అర్జున్ రెడ్డి, మహానటి, రంగస్థలం… ఇలా చాలా సినిమాలు భారీ రన్ టైమ్ తో వచ్చి హిట్ అయ్యాయి. అయితే ఈసారి అంతకుమించిన భారీ నిడివితో వస్తోంది ఈ సినిమా. ఇది కాస్త ఇబ్బంది పెట్టే అంశమే.
సందీప్ రెడ్డి వంగ కొత్త సినిమా యానిమల్. ఈ సినిమా నిడివి అక్షరాలా 3 గంటల 21 నిమిషాలుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రకటించాడు. తమ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని, సినిమాకు ఎ-సర్టిఫికేట్ వచ్చిందని, నిడివి 3 గంటల 21 నిమిషాలుందని వెల్లడించాడు.
ఇంత నిడివి ఉన్న సినిమాను థియేటర్లలో కూర్చొని చూడడం ఇప్పటి తరం ప్రేక్షకుడి వల్ల అవుతుందా అనేది పెద్ద డిస్కషన్ పాయింట్. ఇప్పటివరకు 3 గంటల నిడివి ఉన్న సినిమాల్ని మాత్రమే చూశాడు ప్రేక్షకుడు. ఇంకో 5-6 నిమిషాల అదనపు రన్ టైమ్ ఉన్న సినిమాలు కూడా వచ్చాయి.
కానీ ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్ తో ఓ సినిమా రావడం ఈమధ్యకాలంలో ఇదే తొలిసారి. కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ ఈమధ్య రన్ టైమ్ విషయంలో పట్టింపులకు పోవడం లేదు. అయితే మరీ ఇంత పెద్ద రన్ టైమ్ అంటే మాత్రం ఆలోచించాల్సిందే. కంటెంట్ పై సందీప్ కు ఉన్న నమ్మకానికి ఇదే సాక్ష్యం అని కొందరు చెబుతుంటే, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు.
రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వస్తోంది యానిమల్ సినిమా.