తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'అన్నాత్తే' పై తమిళ రివ్యూయర్లు కూడా నిప్పులు చెరిగారు. ఇదో సినిమానా.. అన్నట్టుగా వీర ఉతుకుడు ఉతికారు. ఆఖరికి రజనీకాంత్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా రజనీని ఇంత దారుణమైన సినిమాలో చూడాలని అనుకోరని, వారు కూడా ఇంకాస్త మంచి సినిమా చూసేందుకు అర్హులంటూ శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తీవ్రంగా విమర్శించారు.
ఎప్పుడో పాతికేళ్ల కిందటి స్థాయి కథా, కథనాలతో ఈ సినిమా తీవ్రంగా విసిగిస్తుందని తమిళ సినీ జర్నలిస్టుల ఇంగ్లిష్ కథనాలు చెబుతున్నాయి. ఇక తెలుగులో అయితే ఈ సినిమాకు ఎక్కడా పాజిటివ్ బజ్ రాలేదు.
రజనీకాంత్ ఇటీవలి సినిమాలు తెలుగునాట ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవడం, ఆ పై కోవిడ్ పరిస్థితుల్లో.. ఈ సినిమాకు పెద్ద ఓపెనింగ్స్ కూడా లేవు. రివ్యూలు వచ్చాకా ఈమాత్రం కళాఖండం చూడటానికి, ఈ పరిస్థితుల్లో ఎందుకు రిస్క్ తీసుకోవాలన్నట్టుగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను లైట్ తీసుకున్నారు!
అయితే తమిళనాట మాత్రం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోందట! ఈ విషయాన్ని అక్కడ ట్రేడ్ ఎనలిస్టులు చెప్పుకొస్తున్నారు. అన్నత్తే సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్టుగా వారు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కలిపి సూపర్ స్టార్ తాజా సినిమా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అధిగమిస్తోందని వారు వివరిస్తున్నారు! ఇందులో తొలి రోజు కలెక్షన్లే డెబ్బై కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని వారు లెక్కగడుతున్నారు.
మరి బాలీవుడ్ సినిమా సూర్యవంశీ కన్నా రజనీకాంత్ సినిమానే కలెక్షన్ ల విషయంలో దూకుడుగా సాగుతున్నట్టు! అయితే మరో మాటే లేకుండా నెగిటివ్ టాక్ పొందిన ఈ సినిమా ఈ స్థాయి కలెక్షన్లను సాధించడం మాత్రం విచిత్రమైన అంశమే. తమిళ రివ్యూయర్లు కూడా ఈ సినిమా పట్ల ఎలాంటి దయాదాక్షిణ్యాలను చూపకుండా విమర్శించారు.
పూర్ రేటింగ్స్ ఇచ్చారు. అయితే కలెక్షన్లు మాత్రం కోటలు దాటుతున్నాయట! కోట్లు దాటుతున్నాయట. మరి రజనీకాంత్ లాంటి హీరోలకు కావాల్సిందీ ఇదే కాబోలు. తామెలాంటి సోది సినిమాలు చేసినా.. వందల కోట్ల రూపాయల వసూళ్లు దక్కుతుంటే, ఇక కథ, కథనాల గురించి ఆలోచించాల్సిన అవసరం వారికి ఏముంటుంది?