సంక్రాంతి తర్వాత మరో లాంగ్ వీకెండ్ వచ్చేసింది. రిపబ్లిక్ డేతో కలిపి శని, ఆదివారాలు వచ్చాయి. దీంతో థియేటర్లలో మరోసారి సినీ సందడి మొదలైంది. మరి ఈ లాంగ్ వీకెండ్ ఏ సినిమాకు ప్లస్ కానుంది. నిస్సందేహంగా హను-మాన్ సినిమాకే ఇది కలిసిరాబోతోంది.
ఈ సినిమా చూసేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీస్ కు ఇదే మెయిన్ ఆప్షన్ గా మారింది. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ లో మరోసారి జోరు చూపిస్తోంది హను-మాన్. ఈ ట్రెండ్ ఇవాళ్టి ఈవెనింగ్ షోస్ నుంచే కనిపిస్తోంది.
హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లు పెంచారు. కాబట్టి సులభంగానే టిక్కెట్లు దొరుకుతున్నాయి. అలా రిపబ్లిక్ డే వీకెండ్ ను కూడా హను-మాన్ క్యాష్ చేసుకోబోతోంది.
అటు గుంటూరుకారం సినిమా పరిస్థితి, హను-మాన్ కు పూర్తి భిన్నంగా ఉంది. విడుదల తర్వాత ఎలాగైతే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా ప్రచారాన్ని తమ భుజానికెత్తుకున్నారో, ఇప్పుడు మరోసారి అదే పని చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ గుంటూరుకారం స్పెషల్ షోలు మరోసారి ప్లాన్ చేశారు ఫ్యాన్స్. ఎప్పట్లానే మెయిన్ థియేటర్ గా సంధ్య 35ఎంఎంను ఎంపిక చేసిన మహేష్ అభిమానులు… తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 27, 28వ తేదీల్లో ప్రత్యేక ప్రదర్శనలు పెట్టుకున్నారు.
నా సామిరంగ సినిమాకు సంక్రాంతి సీజన్ లో కాస్త రద్దీ కనిపించినప్పటికీ, ఎందుకో ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే, ఈ వీకెండ్ తో నాగార్జున సినిమా బాక్సాఫీస్ రన్ క్లోజ్ అయ్యేలా ఉంది. ఇక సైంధవ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
వెంకీ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి బరిలో ఫ్లాప్ అయింది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ సినిమాకు 3 స్క్రీన్స్ మాత్రమే కేటాయించారు. రేపట్నుంచి అవి కూడా లేవు. పూర్తిగా ఎత్తేస్తున్నారు.
రేపు రిలీజ్ అవుతున్న కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలకు భారీగా థియేటర్లు కేటాయించారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అస్సల్లేవు. ఓవరాల్ గా చూసుకుంటే, ఈ లాంగ్ వీకెండ్ హనుమాన్ సినిమాకే మరోసారి కలిసొచ్చేలా ఉంది.