ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమా భగవంత్ కేసరి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో భగవంత్ కేసరి కంటే ముందే బాలయ్య నుంచి మరో సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. అదే భైరవ ద్వీపం. బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా నిలిచిన ఈ సినిమా రీ-రిలీజ్ కు రెడీ అయింది.
బాలకృష్ణ నుంచి ఇప్పటికే కొన్ని సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. బాలయ్యతో పాటు చాలామంది హీరోలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు బాలయ్య నుంచి భైరవద్వీపం మళ్లీ వస్తోంది. ఈ సినిమా విడుదలై 29 ఏళ్లు పూర్తయ్యాయి, 30వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా సినిమాను రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
ఆగస్ట్ 5న భైరవద్వీపం సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు డైరక్ట్ చేసిన ఈ ఫాంటసీ మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ టైమ్ లోనే భైరవద్వీపాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు సింగీతం. ఇప్పుడీ సినిమా 4k రిజల్యూషన్ తో, లేటెస్ట్ ఆడియో హంగులతో రీ-రిలీజ్ కు రెడీ అయింది.
భైరవద్వీపం సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ పెద్ద హిట్టయ్యాయి అప్పట్లో. ఫాంటసీ సినిమాల్ని ఇష్టపడే ఆడియన్స్ కు ఈ సినిమా ఎప్పటికీ హాట్ ఫేవరెట్. అలాంటి వాళ్లకు ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం ఇప్పుడు దక్కింది.