ఎన్నికలు సమీపిస్తున్న వేళలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవి హద్దులు దాటుతున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో బూతులు తిట్టుకోవడం సర్వసాధారణ విషయమైంది. తాజాగా ప్రతిపక్ష నేతలపై మంత్రి అంబటి రాంబాబు చెలరేగిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భయం అంటే ఏంటో చూపిస్తానని నారా లోకేశ్ అనడంపై అంబటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నందమూరి లక్ష్మీపార్వతి రచించిన అల్లుడు సుద్దులు పుస్తకావిష్కరణ సభలో అంబటి ప్రసంగిస్తూ… వైఎస్ జగన్‌కు లోకేశ్ భయాన్ని పరిచయం చేస్తాడా? అసలు తమ ముఖ్యమంత్రి గర్జిస్తే లాగులో పోసుకోవాలంటూ హెచ్చరించడం గమనార్హం. టీడీపీకి లోకేశ్ రూపంలో శని పట్టుకుందని అంబటి వెటకరించారు. లోకేశ్ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందని శాపనార్థాలు పెట్టారు. లక్ష్మీపార్వతి భుజం మీద తుపాకి పెట్టి ఎన్టీఆర్‌ను కాల్చేశారని ఆయన ధ్వజమెత్తారు.
బాబు నిజస్వరూపం ఇంకా లక్ష్మీపార్వతికి తెలియదని అనుకుంటానన్నారు. కానీ చంద్రబాబు బామ్మర్దికి ఆయన నిజ స్వరూపం బాగా తెలుసని అంబటి చెప్పుకొచ్చారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తాడన్నారు. చంద్రబాబు దత్త పుత్రుడు కూడా అందరితో కలిశాడని దెప్పి పొడిచారు. చంద్రబాబు సీఎం కావాలని పవన్ నానా గడ్డి కరుస్తున్నారని మండిపడ్డారు. జగన్‌వి సంప్రదాయేతర రాజకీయాలన్నారు.
లోకేశ్‌కు ఏదో రకంగా ప్యాంట్, షర్ట్ వేసి సీఎం సీటులో కూచోపెట్టాలని తహతహలాడుతున్నారని సెటైర్స్ విసిరారు. లోకేశ్‌తో చేరి దత్త పుత్రుడు పాడై పోతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. త్వరలో పవన్‌పై పుస్తకం రాయాల్సి వస్తుందేమో అని అంబటి అన్నారు. పవన్‌కు కూడా ఒక పుస్తకాన్ని పంపాలని లక్ష్మీపార్వతిని అంబటి రాంబాబు కోరారు.