ఆ మధ్య 'అపరిచితుడు' సినిమాను హిందీలో భారీ ఎత్తున రీమేక్ చేయ సంకల్పించారు శంకర్. తమిళ, తెలుగు భాషల్లో హిట్ అయిన ఆ సినిమాను ఇన్నేళ్లకు హిందీలో రీమేక్ చేయడానికి శంకర్ రెడీ అయ్యారు. రణ్ వీర్ సింగ్ హీరోగా హిందీలో ఆ సినిమాను రీమేక్ అన్నారు. అయితే ఆ రీమేక్ పట్ల అన్నియన్ ప్రొడ్యూసర్ రవిచంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తను తగ్గేది లేదని శంకర్ ప్రకటించుకున్నారు.
అయితే ఆ తర్వాత శంకర్ వేరే సినిమాలతో బిజీ అయ్యారు. భారతీయుడు-2, రామ్ చరణ్ సినిమాలపై శంకర్ వర్క్ చేశారు. అయితే ఈ దర్శకుడు ఈ రెండు సినిమాల మధ్యన అటూ ఇటూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇంతలో అన్నియన్ రీమేక్ ఆగిపోయింది.
అయితే పూర్తిగా కాదట. ఇప్పుడు కథ మారిపోయిందని సమాచారం. రణ్ వీర్ సింగ్ హీరోగా శంకర్ ఒక సినిమా అయితే చేస్తారట. అయితే దీనికి కథ మాత్రం అపరిచితుడు కాదు. ఒక తమిళ నవలను భారీ ఎత్తున తెరకెక్కించనున్నాడట శంకర్.
ఇటీవలే మణిరత్నం తమిళుల ప్రఖ్యాత నవల పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ తో హిట్ కొట్టారు. ఇప్పుడు శంకర్ కూడా ఆ తరహాలో వేల్ పరి అనే తమిళ నవలను సినిమాగా తెరకెక్కించున్నారట. ఇది అద్భుత కథ అని, అనేక పార్శ్వాలుంటాయని, వీఎఫ్ఎక్స్ కు కూడా బోలెడంత స్కోప్ ఉంటుందని సమాచారం. ఆ నవల లెంగ్త్ దృష్ట్యా మొత్తం మూడు పార్టులుగా తీయాలనుకుంటున్నారట శంకర్. ఇది తెరకెక్కితే భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అవుతుందని అంచనా.