తెలంగాణలో అదిగో అధికారం, ఇదిగో అధికారం అంటూ హడావుడి చేసిన భారతీయ జనతా పార్టీకి మోజు మోకాళ్ల మీదకు వచ్చే ఉంటుంది మునుగోడు ఉప ఎన్నికల ఫలితంతో! తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా… తమకు ప్రజలు అధికారాన్ని పల్లెంలో పెట్టి అప్పగించేలా ఉన్నారనేంత స్థాయిలో కమలనాథుల కహానీలు కొనసాగాయి. అదిగో బండి సంజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అనేంత స్థాయిలో రచ్చ చేశారు.
అయితే మునుగోడు కమలం పార్టీకి మింగుడుపడని నిజాలను చాటి చెప్పింది. ఇంకా తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉంది! ఇందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఏదో అధికార పార్టీ నుంచి పేరున్న నేత తిరుగుబాటు చేసి వచ్చి బీజేపీ తరఫున పోటీ చేయాలి, లేదా కోమటిరెడ్డి వంటి కోటీశ్వరులు పోటీ చేయాలి! అప్పుడే బీజేపీ పోటీ ఇస్తుంది. మొదటి స్థానమో, రెండో స్థానమో పొందుతుంది!
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఆర్గానిక్ గ్రోత్ లేదు! అంతా వాపును చూసి బలుపు అనుకోవడమే అని మునుగోడు ఉప ఎన్నికతో స్పష్టం అయ్యింది. రాజగోపాల్ రెడ్డి అంత పోటీ ఇచ్చారంటే అది కూడా బీజేపీ బలం కాదు. ఆయన వ్యక్తిగత శక్తియుక్తి.
మనుగోడు వదిలిస్తే.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన స్థాయి అభ్యర్థులున్నారు? పది..? ఇరవై?! ఇంతకు మించి బీజేపీకి ఎన్ని స్థానాల్లో కనీసం పోటీ ఇవ్వగలిగే స్థాయి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులున్నారు? ఈ విషయాలను కమలం పార్టీ కూలంకషంగా తనలో తాను మాట్లాడుకోగలిగే పరిస్థితి ఉందా!
కేసీఆర్ పై వ్యతిరేకత ఉంది కాబట్టి.. కాంగ్రెస్ కూనరిల్లుతోంది కాబట్టి.. అధికారం తమకే దక్కుతుందని కమలనాథులు పగటి కలల్లో ఉన్నారు. తమ వాపును చూసి బలుపనుకునేంత భ్రమలో ఉన్నారు! అయితే.. వారికి మునుగోడు ఉప ఎన్నిక మంచి పాఠాన్నే నేర్పింది.
అధికారం సంగతెలా ఉన్నా.. నిజంగా అధికారాన్ని సాధించాలనుకుంటే బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావడం కావాలి. అన్నింటికీ మించి బీజేపీకి షాక్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ పోరాటం! మహిళా అభ్యర్థి, అనామకురాలు, ఆర్థిక శక్తి లేకుండా.. ముఖ్య నేతలంతా రాహుల్ పాదయాత్ర పేరు చెప్పి తప్పించుకు తిరిగినా.. స్థానిక ఎంపీ పట్టించుకోకుండా.. క్యాడర్ ను అటు వైపు తోలినా.. దాదాపు 20 వేల స్థాయి ఓట్లు దక్కించుకున్నారు!
గత అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కన్నా మెరుగైన స్థితిలోనే కాంగ్రెస్ నిలిచింది. కాంగ్రెస్ కు డిపాజిట్ అయితే దక్కలేదేమో కానీ.. ఇంత వాడీవేడీ ఎన్నికల్లో.. టీఆర్ఎస్- బీజేపీల మధ్యనే పోరు అనుకున్న చోట కాంగ్రెస్ తన ఉనికిని పూర్తిగా అయితే కోల్పోలేదు. టీఆర్ఎస్ కు తెలంగాణ అంతా తామే ప్రత్యామ్నాయంగా ఉన్నట్టుగా బీజేపీ భ్రమలు ఏవైనా పెట్టుకుని ఉన్నా.. వాటిని కూడా మునుగోడు ఉప ఎన్నిక కొంత వరకూ తొలగించింది!