క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీ వ్యవహారంలో అరెస్టు అయినది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ తనయుడే అనే స్పష్టత వచ్చింది. పార్టీలో డ్రగ్స్ వాడిన ఎనిమిది మందితో పాటు, మరి కొంతమందిని మహారాష్ట్ర ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వారి అరెస్టు ప్రొసీడింగ్స్ పూర్తయ్యాయని సమాచారం. ఈ వ్యవహారంలో ముందుగా ఒక స్టార్ హీరో తనయుడు అరెస్టు అయ్యాడనే వార్తలు బయటకు పొక్కాయి. అయితే అది ఎక్కువ సేపు రహస్యంగా ఉండలేదు. అతడు షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ అని క్లారిటీ రానే వచ్చింది.
అతడితో పాటు మొత్తం ఎనిమిది మంది నిషేధిత డ్రగ్స్ ను వాడినట్టుగా అధికారులు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేయడంతో పాటు, బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షలు జరుపుతున్నట్టుగా సమాచారం.
డ్రగ్స్ వ్యవహారాలు బాలీవుడ్ కు కొత్తేమీ కాదు. అయితే ఇన్నాళ్లూ చోటామోటా నటీనటులు ఇలాంటి వ్యవహారాల్లో పట్టుపడేవారు. అలాంటి వారి పేర్లే రకరకాలుగా వినిపించేవి. అయితే ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ తనయుడే డ్రగ్స్ వ్యవహారంలో దొరికిపోవడం సంచలనం అని చెప్పవచ్చు. రేపోమాపో షారూక్ తన తనయుడిని సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చే అవకాశాలు ఉండేవేమో. అయితే ఈ వ్యవహారంలో అతడు మరో రకంగా చర్చలోకి వచ్చేశాడు.
ఇక పోలీసుల అదుపులో ఉన్న తనయుడి కోసం షారూక్ భార్య గౌరీ ఎన్సీబీ ఆఫీసుకు చేరుకుంది. ఈ వ్యవహారంలో తల్లిదండ్రులకే ముందుగా కౌన్సిలింగ్ తప్పకపోవచ్చు. ఇలా దొరికిపోవడంతో ఆర్యన్ కు శిక్షలేమీ పడకపోవచ్చు. డ్రగ్స్ వినియోగదారులను కేవలం బాధితులుగానే చూస్తూ ఉంటారు అధికారులు కూడా. అయితే వారి ద్వారా డ్రగ్స్ ఏ రూట్లో వచ్చాయనేది మాత్రం కూపీ లాగుతూ ఉంటారు.
ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటారు. తెలుగు సినీ తారలు కొందరు ఇలాంటి వ్యవహారాల్లో ఆల్రెడీ ఎన్సీబీ అధికారుల చుట్టూ తిరిగారు. వారిలో ఎవరూ అరెస్టు కాలేదు. వారందరినీ బాధితులుగా, సాక్షులుగా పరిగణించారు. ఇటీవలే ఈడీ అధికారులు కూడా వారి ఆర్థిక లావాదేవీల గురించి విచారించారు. అప్పుడు కూడా అంతా తేలికగానే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.