కదిలే షిప్ పై డ్రగ్స్ వినియోగం వ్యవహారంలో అరెస్టు అయిన బాలీవుడ్ హీరో షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ దక్కలేదు. అతడి బెయిల్ పిటిషన్ పై వచ్చే బుధవారం రోజున కోర్టు తీర్పు రానుంది. దీంతో అంత వరకూ ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్డు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై గురువారం జరిగిన వాదనలు జరిగాయి. ఎన్సీబీ స్పందిస్తూ.. ఆర్యన్ ఖాన్ రెగ్యులర్ గా డ్రగ్స్ వాడుతున్నాడని పేర్కొంది. అలాగే షిప్ లో ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడనప్పటికీ.. అతడి స్నేహితుల వద్ద డ్రగ్స్ ఉన్నాయని పేర్కొంది. అతడి దగ్గర డ్రగ్స్ లేనంత మాత్రానా.. అతడిని నిర్దోషిగా చెప్పడానికి లేదనేది ఎన్సీబీ వాదనగా తెలుస్తోంది. అలాగే అతడి వాట్సాప్ చాట్ ఆధారంగా డ్రగ్స్ వాడుతున్నాడని చెప్పవచ్చిన ఎన్సీబీ వాదించింది.
అలాగే డ్రగ్స్ ను తెప్పించుకోవడానికి సంబంధించి కూడా ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్ లో ఆధారాలున్నాయని ఎన్సీబీ వాదించింది. అయితే ఈ వాదనతో ఆర్యన్ ఖాన్ న్యాయవాది విబేధించారు. ఆర్యన్ ఖాన్ స్నేహితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్ పరిమాణాన్ని బట్టి ఈ కేసులో శిక్ష ఆధారపడి ఉంటుందని.. కాబట్టి.. అతడికి బెయిల్ ఇవ్వవచ్చు అనే వాదనను వినిపించారు.
అలాగే వాట్సాప్ లో నేటి తరం యువత చాలా రకాల విషయాలను మాట్లాడుతూ ఉంటుందని, వాటిని డీకోడ్ చేసి డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నట్టుగా చెప్పడానికి ఆధారం ఏమిటని ఆర్యన్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారమే.. డ్రగ్స్ పరిమాణాన్ని బట్టి చట్టపరమైన చర్యలు ఆధారపడి ఉంటాయన్నారు. తన క్లైంట్ స్నేహితుల వద్ద పట్టుబడిన ఆరు గ్రాముల డ్రగ్స్ ను బట్టి వారికి బెయిల్ కేటాయించవచ్చుననే వాదన వినిపించారు. ఈ బెయిల్ పిటిషన్ పై వచ్చే బుధవారం తీర్పు వచ్చే అవకాశాలున్నాయి.