రానురాను జనాలు ఎలా తయారయ్యారంటే, ఫ్లాప్ అయిన సినిమా ఫ్రీగా దొరికినా చూడట్లేదు. టైమ్ వేస్ట్ అని ఫీల్ అవుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచాయి 2 సినిమాలు. వీటిలో ఒకటి చంద్రముఖి-2 కాగా, రెండోది గాడ్ సినిమా.
లారెన్స్ హీరోగా నటించిన సినిమా చంద్రముఖి-2. బ్లాక్ బస్టర్ చంద్రముఖికి సీక్వెల్ అంటూ భారీగా ప్రచారం చేశారు. కంగనా రనౌత్ కూడా ఉందంటూ ఊదరగొట్టారు. అటు గాడ్ సినిమాకి కూడా ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. జయం రవి, నయనతార జంటగా నటించారు.
ఇలా భారీ అంచనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అనేకంటే డిజాస్టర్లు అంటే బెటర్. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు వెబ్ లో హెచ్ డీ వెర్షన్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాల్ని పైరసీలో కూడా చూడ్డానికి ఇష్టపడడం లేదు. హెచ్ డీ వీడియో అందుబాటులో ఉన్నా పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్ నడుస్తోంది.
కేవలం ఈ రెండు సినిమాల విషయంలోనే కాదు, ఫ్లాప్ అయిన దాదాపు అన్ని సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది. ఓసారి థియేటర్లలో ఫ్లాప్ టాక్ వస్తే, పైరసీలో కూడా చూడ్డానికి ఇష్టపడడం లేదు. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ సంగతి సరేసరి.
అన్నట్టు ఈ రెండు సినిమాలు ఈ నెలాఖరుకు ఓటీటీలోకి రాబోతున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. పైరసీలోనే చూడని జనం, ఓటీటీలో ఈ సినిమాల్ని చూస్తారా..?