మరో సినిమా సందడి.. ఈసారి కూడా వారానికొకటి

ఆగస్ట్ వచ్చింది. మళ్లీ సందడి మొదలైంది. జూన్, జులై నెలల్లో కనిపించినట్టుగానే.. ఆగస్ట్ లో కూడా వారానికో సినిమా సిద్ధంగా ఉంది. కాకపోతే ఈనెల ప్రత్యేకత ఏంటంటే..మొదటి వారం మినహాయిస్తే, ప్రతివారం ఓ మెగా…

ఆగస్ట్ వచ్చింది. మళ్లీ సందడి మొదలైంది. జూన్, జులై నెలల్లో కనిపించినట్టుగానే.. ఆగస్ట్ లో కూడా వారానికో సినిమా సిద్ధంగా ఉంది. కాకపోతే ఈనెల ప్రత్యేకత ఏంటంటే..మొదటి వారం మినహాయిస్తే, ప్రతివారం ఓ మెగా హీరో సినిమా థియేటర్లలోకి వస్తోంది. వీటితో పాటు.. భైరవద్వీపం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి రీ-రిలీజెస్ కూడా ఉన్నాయి.

ఈ వారాంతం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. వీటిలో అంతోఇంతో ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ ఎల్జీఎం (లెట్స్ గెట్ మ్యారీడ్) మాత్రమే. క్రికెటర్ ధోనీ నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా ఇది. లవ్ టుడే ఫేమ్ ఇవానా ఇందులో హీరోయిన్ గా నటించగా, హరీష్ కల్యాణ్ హీరోగా చేశాడు.

ఈ సినిమాతో పాటు.. రాజుగారి కోడిపులావ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, ప్రియమైన ప్రియ లాంటి సినిమాలు ఈ వీకెండ్ వస్తున్నాయి. ఇక భైరవద్వీపం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలు కూడా ఇదే వారం మరోసారి థియేటర్లలోకి వస్తున్నాయి.

రెండో వారంలో సిసలైన సందడి షురూ కానుంది. చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ అవుతోంది. చిరంజీవి, తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తిసురేష్ నటించగా, మరో కీలక పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడు. తమిళ్ లో వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది.

భోళాశంకర్ రిలీజ్ కు ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భోళాశంకర్ విడుదలకు ఒక రోజు ముందు జైలర్ సినిమా రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. తమన్న హీరోయిన్ గా నటించిది. ఇదే వారం ఉస్తాద్ అనే చిన్న సినిమా వస్తోంది. వరుస ఫ్లాపులిస్తున్న శ్రీసింహా కోడూరి ఈ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

మూడో వారంలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఆదికేశవ సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేస్తున్న పెదకాపు-1 అనే సినిమా కూడా వస్తోంది. సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్, నచ్చినవాడు అనే మరో చిన్న సినిమా కూడా ఈ వారంలో వస్తున్నాయి.

ఇక ఆగస్ట్ నెల చివరి వారంలో వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా వస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ సినిమాతో పాటు కార్తికేయ-నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన బెదురులంక సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అటు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఊరు పేరు భైరవకోన సినిమాలు కూడా ఆగస్ట్ లోనే వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే రిలీజ్ డేట్స్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు.