చెత్త పాటలతో వీరయ్య, వీరసింహుడు

సంక్రాంతి బరిలో రెండు పెద్ద హీరోల సినిమాలంటూ తెగ ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సినిమాలంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఏ సీజన్లో ఎలా చూసినా సంక్రాంతికి మాత్రం ప్రేక్షకులు చాలా ఉదారంగా ఉంటారు సినిమాల…

సంక్రాంతి బరిలో రెండు పెద్ద హీరోల సినిమాలంటూ తెగ ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సినిమాలంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఏ సీజన్లో ఎలా చూసినా సంక్రాంతికి మాత్రం ప్రేక్షకులు చాలా ఉదారంగా ఉంటారు సినిమాల విషయంలో. అందుకే ఆ సమయంలో ఎటువంటి చిత్రాలొచ్చినా ఇంచుమించు ఆదరించిన దాఖలాలే ఎక్కువ. మరీ దారుణమైతే తప్ప ఆ పండగ టైములో డిసాస్టర్లు నమోదు కావు. అందుకే ఆడియన్స్ పేపర్ ని లిబరల్ గా దిద్దుతారనే ఆశతో హీరోలంతా సంక్రాంతికోసం వెంపార్లాడుతుంటారు. తప్పులేదు. 

అయితే ఈ సారి ఒక విడ్డూరం చోటు చేసుకుంది. చిరంజీవి “వాల్తేర్ వీరయ్య”, బాలకృష్ణ “వీర సింహారెడ్డి” రెండింటికీ నిర్మాత ఒక్కరే..మైత్రీ మూవీస్ బ్యానర్. ఒకే సీజన్లో తమ రెండు సినిమాలు విడుదల చేయడం వల్ల రమారమి 15 నుంచి 20 కోట్ల వరకు నష్టమొస్తుందని ఒక అంచనా. అయినా వాళ్లకి తప్పట్లేదు. ఎందుకంటే ఇద్దరు హీరోలకీ సంక్రాంతే కావాలి. నిర్మాత గోల వాళ్లకి అనవసరం. ఉన్నంతలో ఇక్కడ బాలకృష్ణనే అనాలి. లెక్క ప్రకారం డిసెంబర్లో రావాల్సిన తన సినిమాని తగుదునమ్మా అని పట్టుబట్టి మరీ సంక్రాంతికి ఈడ్చాడు.. చిరంజీవి సినిమాకి పోటీగా. 

ఇలా రకరకాల తలనొప్పులను భరించి చేసేది లేక మైత్రీ బ్యానర్ సంక్రాంతి సీజన్లోనే రెండు సినిమాలూ నష్టానికి సిద్ధపడే విడుదల చేస్తున్నారు. 

అయితే ఇప్పుడు వాళ్ల చేతుల్లో ఉన్నది ఒకటే దారి. రెండు సినిమాలకి విపరీతమైన బజ్ తీసుకురావాలి. అభిమానుల మధ్య మా హీరో సినిమా గొప్పదంటే మా హీరో సినిమా గొప్పదనే పోటీ నెలకొల్పాలి. అప్పుడే రెండింటికీ గిరాకీ పెరిగి రెండూ బాగా ఆడే అవకాశముంది. అప్పుడు పైన అనుకున్న నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఒక్క సినిమాకి కాస్త బజ్ తగ్గినా నష్టం శాతం పైన అనుకున్నదానికంటే పెరుగుతుంది. రెండింటికీ కావాల్సిన బజ్ రాకపోతే నిర్మాత నెత్తిమీద రెండు పిడుగులు ఒకేసారి పడినట్టే. 

మరి బజ్ ఎలా వస్తుంది? ముందుగా పాటల వల్లే వస్తుంది. అప్పట్లో “రంగస్థలం” సినిమాకి బజ్ పెద్దగా లేనప్పుడు “యేరుసెనగ కోసం..” పాట విడుదలయింది. అంతే ఒక్కసారిగా బజ్ వచ్చేసింది. క్రమంగా మిగిలిన పాటలు కూడా అద్భుతమనిపించడం వల్ల ఓపెనింగ్ కలెక్షన్స్ కి ఢోకా లేకుండా అయిపోయింది. సినిమా కూడా బాగుంది..దాంతో తిరుగులేని విజయం సాధించింది. 

ఇటువంటిదే “పుష్ప” విషయంలో కూడా జరిగింది. అలాగే ఆ మధ్యన “అల వైకుంఠపురంలో” కూడా. 

కానీ అదేంటో …”వాల్తేర్ వీరయ్య” నుంచి మొన్న విడుదలైన “బాస్ పార్టీ” పాట కానీ,  “వీర సింహా రెడ్డి” నుంచి నేడు విడుదలైన “జై బాలయ్య” పాట కానీ బజ్ తీసుకురాకపోగా నెగటివిటీని మూటగట్టుకున్నాయి. 

“బాస్ పార్టి” అనే పాట ఎప్పుడో సింబు నటించిన తమిళ సినిమా “సిలంబాట్టన్” అనే సినిమాలోని “వేరీజ్ ద పార్టీ” కి అనుసరణ. ట్యూన్ కాపీ కాకపోయినా కాన్సెప్ట్ అదే. ఈ పాటలో కూడా “వేరీజ్ ద పార్టీ” యథాతథంగా ఉంది. ట్య్యొన్ ఒరిజినలే అనుకున్నా పాటకు రాసిన సాహిత్యమైతే అత్యంత పేలవంగా చాలా సాధారణ స్థాయిలో ఉంది తప్ప దేవీశ్రీప్రసాద్ రాసినట్టు లేదు. నిజానికి దేవి అప్పుడప్పుడు కలం విదిలించి మంచి పాటలే రాస్తుంటాడు. “నువ్వు చూడగానె చిట్టి గుండె..” అంటూ అత్తారింటికి దారేదిలో రాసినా, “సూపర్ మచ్చి..” అంటూ సన్నాఫ్ సత్యమూర్తిలో రాసినా శహబాష్ అనిపించుకున్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు..దేవీశ్రీప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 30 వరకు సినీగీతాలు రాసాడు. 

కానీ “బాస్ పార్టీ” మాత్రం ఎప్పుడూ లేనంత బ్యాడ్ గా రాసి రిస్క్ చేసాడు. చేసిన ట్యూన్ ఎలా ఉన్నా లిరిక్ సరిగా ఉంటే బాగుండేది. రెండింటిలోనూ ఫెయిలయ్యాడు దేవి. 

ఇక తమన్ విషయానికొస్తే “జై బాలయ్య” పాటతో ఛీకొట్టించుకుంటున్నాడు. ఎప్పుడో 1990ల నాటి వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచి పాడిన “ఓసేయ్ రాములమ్మ” పాట ట్యూనుని ఎత్తేసి తిరగమోతేసి పెనం మీదనుంచి దింపాడు. అంత భావదారిద్ర్యమా!

ఇక ఈ భావదారిద్ర్యంలో రామజోగయ్య హస్తం కూడా లేకపోలేదు. సీనియర్ గీత రచయిత అయ్యుండి కూడా ఇప్పుడే ఫీల్డులోకొచ్చిన ఎంట్రీలెవెల్ గీతరచయితలాగ రాసాడు పడిగట్టు పదాలతో. అసలు “జై బాలయ్య” కి ఈ వీరసింహారెడ్డికి సంబంధమేంటి? ఒకవేళ రాసింది ఎలక్షన్ సాంగైతే అనుకోవచ్చు. 

“నిన్ను తలుచుకున్నవారు లేచి నుంచుని మొక్కుతారు” అనే లైన్లో చివరి పదం “ముక్కుతారు” అన్నట్టు కూడా వినిపిస్తోంది. ఇదే పదం మళ్లీ రాసాడీయన…”మూడు పొద్దుల్లోన నిన్నే తలచి మొక్కుతాందయ్య” అంటూ. ఇక్కడ మాత్రం స్పష్టంగా “ముక్కుతాందయ్యా” అనే వినిపిస్తోంది. పాపం! ఎంత ముక్కుతూ రాసాడో జోగయ్యగారు ఈ పాటని. ఒకే పదాన్ని పాటలో రెండు సందర్భాల్లో వాడడం పదదారిద్ర్యానికి నిదర్శనం. అది అశ్రద్ధవల్ల వస్తుంది. మరో చోట “కురిసే వెన్నెల మోత నువ్వే” అని లిరికల్ వీడియోలో ఉంది. “వెన్నెల మోత” ఏవిటి అర్ధం లేకుండా? అది “వెన్నెల పోత” అయ్యుండాలి. ఇలా అశ్రద్ధ అనేది ఈ విభాగంలో కూడా తాండవించింది. 

రజినీకాంత్ హీరోగా పోయినేడాది “పెద్దన్న” అని ఒక సినిమా వచ్చింది. ఇప్పుడొస్తున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రెండూ ఆ కోవలో కొట్టుకుపోతాయేమోనని అనుమానాలొచ్చే  విధంగా ఉన్నాయి ఈ రెండు పాటలూను. 

రెండో సింగిలైనా పాతపాటల ఎంగిలి లేకుండా వస్తాయని ఆశించాలి. అవీ ఇలాగే అఘోరిస్తే ఇక క్రమంగా ఆశలొదిలేసుకోవాలి. 

కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిస్తూ, కోట్లు, లక్షలు పారితోషకాలు తీసుకుంటూ పాటలని ప్రసవించాలి కానీ ఇలా విసర్జించకూడదు. 60 దాటిన హీరోలంటే నలభైల్లో ఉన్న ఈ సంగీత దర్శకులకి చులకనేమో! యువహీరోలకి పనిచేసే విషయంలో చూపించే శ్రద్ధ పెద్దహీరోలపై పెట్టట్లేదు. 

శ్రీనివాసమూర్తి