తామరపువ్వునే మనం కమలం అంటాం. దీనికే పంకజం అని కూడా పేరు. పంకము అంటే బురద. బురదలో అంటే నీటిగుంటల్లో మాత్రమే పుట్టేది గనుక దానికి ఆ పేరు వచ్చింది. మరి తామరపువ్వు కోసుకోవాలనుకునే వారు, కోరుకునేవారు ఏం చేయాలి? బురదలోకి దిగాల్సిందే. బురద పూసుకోకుండా కమలం అందుకోవడం అసాధ్యం.
రాజకీయాల్లో కూడా ఇప్పుడు వాతావరణం అలాగే కనిపిస్తోంది. కమలం (బిజెపి)ని అందుకోవాలంటే.. బురద పూసుకోవడం, వివాదాల్లో చిక్కుకోవడం, తప్పేలా లేదు. పాపం అందరి కష్టాలు ఒక ఎత్తు అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథి రఘురామక్రిష్ణరాజు కష్టం మరొక ఎత్తు! కమలాన్ని అందుకోవాలని ఆయన చాన్నాళ్లుగా ఉవ్విళ్లూరుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ మీద జగన్ దయతో, జగన్ ఫోటో పెట్టుకుని గెలిచాడు గనుక.. ఇప్పుడు పువ్వు కండువా కప్పుకుంటే పదవి పోతుందని భయపడుతున్నాడు గానీ.. లేకపోతే, ఏనాడో కమలతీర్థం పుచ్చుకునేవాడే! ఈ నేపథ్యంలో ఆయనకు ఇంకా కమలం అందనేలేదు గానీ.. బురదమాత్రం ఇప్పుడే పులముకుంది. తెలంగాణలో తెరాస ఎమ్మెల్యేలకు 200 కోట్లరూపాయలు ఎర వేసిన కేసులో.. కీలకంగా విచారించడానికి రఘురామక్రిష్ణరాజుకు కూడా సిట్ పోలీసులు సమన్లు సర్వ్ చేశారు. 29న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
జగన్ తో సున్నం పెట్టుకున్న తర్వాత రఘురామరాజు.. చాలా రకాల ఆటలు ఆడుతూ వచ్చారు. యూట్యూబ్ వీడియోలు రిలీజ్ చేస్తూ.. నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించే ప్రకటనలతో ఆయన చాలా సంచలనాత్మక వ్యక్తి అయిపోయానని అనుకున్నారు. తెలుగుదేశాన్ని, పవన్ ను భజనచేస్తూ మాట్లాడేవారు. మా పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు అని జగన్ ను చాలా వెటకారంగా అంటూనే.. ఏపీ ప్రభుత్వం దుర్మార్గం నీచం అంటూ ప్రభుత్వాన్ని తప్పుపట్టేవారు. అనర్హత వేటు పడకుండా అన్ని టెక్నికల్ జాగ్రత్తలు తీసుకుంటూ నాటకాలు ఆడేవారు.
జగన్ తో వైరం తర్వాత.. తనకు రాజకీయ రక్షణ కోసం ఆయన కమలం పార్టీ పంచకు చేరారు. పార్టీలో సభ్యత్వం తీసుకోకపోయినా వారితో సన్నిహితంగా మెలగుతున్నారు. వారికీ ఉపయోగపడుతున్నారు. వారితో సన్నిహిత సంబంధాల వల్లే.. జగన్ సర్కారునుంచి ముప్పు ఉన్నదనే మాటలు చెప్పి.. తన స్థాయికి తగని వై కేటగిరీ భద్రతను కూడా తెచ్చుకున్నారు. తనను గెలిపించిన సొంత నియోజకవర్గంలో తిరగడానికి కూడా భయపడే ఈ రఘురామరాజు.. వైకేటగిరీ భద్రతతో హడావుడి చేస్తుంటారు.
ఇప్పుడు తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు ఆయన వైపు వేలు చూపెడుతోంది. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి ఇప్పటికే అరెస్టు అయి విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే వారు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన 200 కోట్లు నగదు ఎక్కడో దొరకలేదు. తాజాగా రఘురామకు నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఆ నిందితులకు అవసరం వచ్చినప్పుడు హైదరాబాదులో డబ్బు సర్దుబాటు చేసేలా రఘురామ పాత్ర ఉన్నదా? అలాంటిది తెలియడం వల్లనే ఆయనను విచారణకు పిలిచారా? అనే చర్చ జరుగుతోంది.
పాపం.. ఇంకా కమలతీర్థం పుచ్చుకోక ముందుగానే.. రఘురామకు ఒళ్లంతా బురద పులుముకున్నదని పలువురు జాలి చూపిస్తున్నారు.