జనసేన నేతలకు మాటలెక్కువ, చేతలు తక్కువ. జనసేనాని చర్యలన్నీ అతివృష్టి, అనావృష్టి అనేట్టుగా వుంటాయి. షూటింగ్‌లు లేని రోజుల్లో మాత్రమే పొలిటికల్ షెడ్యూల్ వుంటుంది. లేదంటే రాజకీయాలకు ప్యాకప్ చెబుతుంటారు. అప్పుడప్పుడు జనంలోకి వచ్చి… నోటికొచ్చినట్టు జగన్‌ను, వైసీపీ నేతల్ని తిట్టి పవన్ వెళ్లిపోతుంటారు. తనకు ధైర్యం ఎక్కువని, ప్రాణాలకు తెగించిన వాడినని, ఇంకా ఏవేవో వీరోచిత వ్యాఖ్యలు చేయడం పవన్‌కు అలవాటే.
ఈ నేపథ్యంలో పవన్ పిరికితనాన్ని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బయట పెట్టారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో నాదెండ్ల ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. తమ పార్టీ పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఏ పార్టీతోనైనా పొత్తు వుంటే ధైర్యంగా చెప్పే దమ్ము పవన్‌కల్యాణ్‌కు వుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు ఆయుధంగా వాడుతున్నారు.
జనసేన మాటల్లో తప్ప చేతల్లో పారదర్శకతకు చోటు లేదని నెటిజన్లు పోస్టులు పెట్టడం గమనార్హం. ఇదే సందర్భంలో పవన్ పిరికితనాన్ని నాదెండ్ల బయట పెట్టారని వారు కామెంట్స్ చేయడం విశేషం. ఇటీవల విశాఖలో ప్రధాని మోదీతో పవన్ భేటీకి సంబంధించి అసలేం జరిగిందో ఎందుకు చెప్పలేదనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. ప్రధాని తనకు చేసిన దిశానిర్దేశం ఏంటో చెప్పే దమ్ము, ధైర్యం పవన్‌లో ఎందుకు లేవని నెటిజన్లు నిలదీస్తున్నారు.
మోదీతో భేటీ తర్వాత రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందనే ఒకే ఒక్క మాట తప్ప, ఏం మాట్లాడారో ఎందుకు ప్రజానీకానికి చెప్పడం లేదని నిలదీస్తున్నారు. పవన్ పిరికితనాన్ని బయట పెట్టేందుకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.
జనసేనలో పారదర్శకత లోపించడం వల్లే అనేక అనుమానాలకు దారి తీస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని పార్టీలు కావాలనే విష ప్రచారం చేస్తున్నాయని నాదెండ్ల అంటున్నారని, నిజాలు చెప్పకం పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన గ్రహించాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు.