బాలకృష్ణ చాలెంజ్ చిరంజీవికి కలిసొచ్చింది

బాలకృష్ణ జాతకంలో ఏముందో ఆయనకే బాగా తెలుసు. తాను తీసుకున్న నిర్ణయం తనకి కాకుండా ప్రత్యర్థికి కలిసొస్తే దానికి ఏ గ్రహస్థానం వీక్ గా ఉన్నట్టో ఆయనే చెప్పాలి. ప్రస్తుతానికైతే అదే జరిగింది. ఆయన…

బాలకృష్ణ జాతకంలో ఏముందో ఆయనకే బాగా తెలుసు. తాను తీసుకున్న నిర్ణయం తనకి కాకుండా ప్రత్యర్థికి కలిసొస్తే దానికి ఏ గ్రహస్థానం వీక్ గా ఉన్నట్టో ఆయనే చెప్పాలి. ప్రస్తుతానికైతే అదే జరిగింది. ఆయన చేసిన చాలెంజ్ ఆయనకి కలిసిరాకపోయినా చిరంజీవికి, నిర్మాతలకి కలిసొచ్చింది. 

మైత్రీ మూవీ మేకర్స్ వారు “వీర సింహా రెడ్డి” సినిమాని డిసెంబర్ 2022లో విడుదల చేయదలచుకుంటే దానిని బలవంతంగా సంక్రాంతికి నెట్టి “వాల్తేర్ వీరయ్యకి” పోటీగా నిలిపాడు బాలకృష్ణ. హీరోగారు హుకుం జారీ చేసాక వినక తప్పని కట్టప్పలు ప్రస్తుత నిర్మాతలు కనుక బిక్కుబిక్కుమంటూనే ఆయన కోరిక తీర్చారు. తాము తీసిన రెండు సినిమాల మధ్య తామే పోటీ పెట్టడం వల్ల రెండు సినిమాలూ నష్టాలు చవిచూస్తాయని భయపడ్డారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. 

రెండు పెద్ద సినిమాలు ఒక రోజు తేడాతో రావడంతో ఇరువర్గాల అభిమానులూ తలపడ్డారు. పోటా పోటీగా ప్రెష్టీజ్ ఇష్యూ అనుకున్నారు. బాలకృష్ణ వీరాభిమానులు తొలి రోజు భారీగా టికెట్లు కొని ఊరికే పంచారు. చాలా థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు పెట్టినా లోపల సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అంటే కొని వదిలేసిన బాపతు కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా తమ హీరో రికార్డ్ కోసం. ఇలా చేస్తున్నారని తెలిసి కమ్మేతర, తెదేపాయేతర సమూహాలు చిరంజీవి సినిమా టికెట్స్ కొనడం మొదలు పెట్టారు. ఈ తంతు తొలి రోజు పలు చోట్ల జరిగింది. 

పండగ వాతావరణంలో ప్రేక్షకులు వాల్తేర్ వీరయ్యకి పట్టం కట్టారు. ప్రధాన కారణాలు రెండు- ఒకటి “వీర సింహా రెడ్డి” లో హింస తప్ప వినోదం లేకపోవడం, సైకలాజికల్ గా బాలకృష్ణ ఒక వర్గానికి మాత్రమే ఎక్కువగా సంబంధించిన హీరో అనే భావన కలగడం. 

“వాల్తేర్ వీరయ్యని” ఎన్నుకున్నందుకు అందులో కొంత కామెడీ పాళ్లు కూడా ఉండడం వల్ల సినిమాకి పాజిటివ్ టాక్ కి తోడ్పడింది. ఇదొక్కటి మినహాయిస్తే కథ పరంగా రెండు సినిమాలు ఒకటే. పెద్దగా తేడాల్లేవు. అక్కడా తలలు తెగిపడ్తాయి, ఇక్కడా పడతాయి; అక్కడ చెల్లి చస్తుంది, ఇక్కడ తమ్ముడు చస్తాడు; అక్కడొక దేశం బ్యాక్ డ్రాప్, ఇక్కడొక దేశం బ్యాక్ డ్రాప్! 

అయినప్పటికీ తెదేపాకి వ్యతిరేకంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి జనం ఎటువంటి మేండేట్ అయితే ఇచ్చారో అదే విధంగా బాలకృష్ణ కి వ్యతిరేకంగా తన సినిమాతో ఉన్నందుకు చిరంజీవికి అదే మేండేట్ ఇచ్చారు. 

ఇవే సినిమాలు సంక్రాంతికి కాకుండా మామూలు రోజుల్లో విదివిడిగా వచ్చుంటే ఘోరంగా దెబ్బతినుండేవు. “ఆ మాత్రం పోటీ ఉందాలి” అనుకుంటూ బాలయ్య తన సినిమాని చిరంజీవి పక్కన పెట్టి చిరంజీవికి కలిసొచ్చేలా చేసాడు. 

అదలా ఉంటే, బాలకృష్ణకి సీరియస్ సినిమాలే తప్ప కామెడీలు సెట్టవ్వవు. ప్రస్తుతం తనకున్న లుక్స్ కి, ఇమేజుకి హై వోల్టేజ్ పాత్రలకే తన కెరీర్ పరిమితమైపోయింది. పంచ్ డైలాగులు కొట్టుకుంటూ, వార్ణింగులిచ్చుకుంటూ గడిపేయాలి తెర మీద. దీనివల్ల ఒక వర్గం ప్రేక్షకులు తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ పట్టించుకునే పరిస్థితి ఉండదు. అలా కాకుండా తన లుక్స్ ని తన కంటే ఐదేళ్లు పెద్దవాడైన చిరంజీవిని చూసి స్ఫూర్తిపొంది మార్చుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చూడబుద్ధేస్తాడేమో. 

ఇక చిరంజీవి గురించి చెప్పుకుంటే 9 ఏళ్ల విరామం తర్వాత 2017లో ఖైది 150తో వచ్చి హిట్ కొట్టడం జరిగింది. తర్వాత వరుసగా తన వయసుకు తగిన పాత్రలనుకుంటూ సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ చేస్తే అభిమానులు నీరసంగా స్పందిస్తే, ప్రేక్షకులు మొహం చాటేశారు (గతంలో కూడా రుద్రవీణ లాంటి సీరియస్ సినిమాలు చేస్తే జనం ఆదరించలేదు). మళ్లీ “వాల్తేర్ వీరయ్య” అనుకుంటూ లుంగీ ఎగ్గట్టి స్టెప్పులేసి ఊర మాస్ సీన్స్ లో కనిపిస్తే జనం పట్టం కట్టారు. క్లారిటీ ఏంటంటే చిరంజీవికి సీరియస్ జానర్స్ నప్పవు. ఎంత వయసొచ్చినా ఇలా చేసుకుపోవాల్సిందే. వయసుని ఆయన లెక్కేసుకుంటున్నాడేమో గానీ జనం పట్టించుకోవట్లేదు. చూస్తున్నదానిని బట్టి మరో ఐదారేళ్లు ఈజీగా చిరంజీవి ఇలాంటి సినిమాలు చేసుకుంటూ గడిపేయొచ్చు. ఆయన లుక్స్ అలా ఉన్నాయి. తర్వాత కూడా పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ఇప్పటికన్నా యంగ్ గా కనిపిస్తూ మరిన్ని సినిమాలు చేయవచ్చేమో కూడా! 

శ్రీనివాసమూర్తి