తెలుగుదేశం పార్టీ ని ఏపీలో అధికారంలోకి తీసుకురావడానికి జనసేనాని పవన్ కల్యాణ్ కుదుర్చుకోబోతున్న కొత్త పొత్తుబంధం తెలంగాణలో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో ఈ రెండు పార్టీలకు కూడా ఉన్నది నామమాత్రపు అస్తిత్వమే. అయితే ఇద్దరూ కలిసి ఎంతో కొంత బలం పెంచుకోవాలని ఉమ్మడి వ్యూహరచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో తన జనసేనను బలోపేతం చేసే దిశగా ఈనెల 24న పవన్ కల్యాణ్ నియోజవర్గస్థాయి కార్యకర్తలతో సమావేశం కూడా పెట్టుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న వ్యక్తి. ఆయన 32 నారసింహ క్షేత్రాల యాత్రను చేయదలచుకున్న సంగతి చాలాకాలం కిందటే ప్రకటించారు. అనుష్టుప్ నారసింహ యాత్ర పేరుతో.. రెండు తెలుగురాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో విస్తరించిన మొత్తం 32 నారసింహ క్షేత్రాలను సందర్శించాలనేది ఆయన ప్రణాళిక! తెలంగాణ ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనారసింహ ఆలయ సందర్శనతో ఈ 32 క్షేత్రాల సందర్శన ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందుకు ఈ నెల 24న ముహూర్తం నిర్ణయించారు.
అందుకు ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో కూడా పవన్ ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మెగా ఫ్యామిలీ అందరూ ఆంజనేయ స్వామి భక్తులు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది రాజకీయయాత్రకు ఉపయోగించనున్న వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేకపూజలు కూడా చేయిస్తారు. ఆతరువాత కొండగట్టులోనే తెలంగాణలో 35 నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. తెలంగాణలో పార్టీ భవిష్య కార్యచరణపై చర్చిస్తారు.
అయితే, కేసీఆర్ భారాస పేరుతో ఇతర రాష్ట్రాల్లో పొరుగున ఉన్న ఏపీలో కూడా రాజకీయాలు చేయడం ప్రారంభించాక పవన్ కల్యాణ్ తెలంగాణలో కూడా తన దూకుడు పెంచుతుండడం గమనార్హం. ఇదే సమయంలో తెలుగుదేశానికి కూడా తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబునాయుడు ఇంకోవైపు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం సభను సక్సెస్ చేసిన తర్వాత.. తెలంగాణలో మరో రెండు బహిరంగసభలతో ఇంకాస్త ఊపు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఏపీలో పొత్తుపెట్టుకుని ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే పొత్తును కొనసాగిస్తూ ముందుకు వెళితే ఉభయులకూ ఎంతో కొంత లాభం ఉంటుందని తలపోస్తున్నాయి.
పవన్ ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామి అనే హోదాతో బిజెపి బంధం కలిగిఉన్నప్పటికీ.. తెలంగాణలో ఆ పార్టీ పవన్ ను వీసమెత్తు కూడా ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అస్తిత్వం కావాలంటే.. తెలుగుదేశంతో కలిసి అడుగులు వేసినట్లయితే.. కొంత ఉపయోగం ఉంటుందని పవన్ భావిస్తున్నారు. అయితే ఏపీ ఎన్నికలకు ఆరునెలల ముందు జరిగే తెలంగాణ ఎన్నికల్లో వీరిద్దరు కలవడం అనేది .. ఏపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే సంశయం ఇరువురిలోనూ ఉన్నట్టుగా తెలుస్తోంది.