ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘అమ్మఒడి’ పేరుతో ఒక పథకం తీసుకువచ్చారు. దీనిని కేవలం ప్రజలకు డబ్బు పంచే కార్యక్రమంగా చూడడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. ఎందుకంటే.. ఆర్థిక ఒత్తిళ్ల వల్ల పిల్లలను స్కూళ్లు మాన్పించడం, తద్వారా డ్రాపవుట్స్ పెరగడం, సమాజంలో స్కిల్డ్ యువతర కొరవడడం వంటి అనేక సామాజిక సమస్యలు తయారవుతున్నాయి. భవిష్యత్తరాల్లో చదువుల పరంగా.. రాష్ట్రంలో ఏ ఒక్క చిన్నారి కూడా చదువులేకుండా ఉండకూడదు, డ్రాపవుట్ గా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. దీనిద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఆశించినలక్ష్యం నెరవేరుతోంది.
అయితే ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే తెలిసిన రాజకీయ నాయకులకు ఇది కేవలం డబ్బు పంచిపెట్టే కార్యక్రమంలాగా మాత్రమే కనిపిస్తే తప్పులేదు. అలాటివాళ్లు డబ్బు పంచే కార్యక్రమాలను, పథకాలను ప్రకటించడం ద్వారా తాము అధికారంలోకి వచ్చేస్తామని కలలుగంటేనే తప్పు. ప్రజల ఆర్థిక వికాసం పట్ల, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం పట్ల కనీస చిత్తశుద్ధి లేకుండా కేవలం వారికి డబ్బులు పంచేయడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే వ్యూహానికి కాంగ్రెస్ తెగబడుతోంది.
ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రంలో డబ్బు పంపకాల పథకాలను ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక వాధ్రా ప్రకటించడం విశేషం. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా రాష్ట్రంలో పెళ్లయిన ప్రతి మహిళ ‘గృహలక్ష్మి’పథకం పేరుతో నెలకు 2వేల రూపాయల వంతున, ఏడాదికి 24 వేలు ఇస్తాం అని ప్రకటించింది. ఈ సొమ్మును నేరుగా మహిళల ఖాతాల్లోనే జమచేస్తారట.
ఇంత బేవార్సుగా ఒక ఎజెండా అంశంగానీ, ఒక లక్ష్యంగానీ లేకుండా కేవలం డబ్బు పంచేయాలని అనుకోవడం, ఆ ఎర వేసి ఓట్లు దండుకోవాలని చూడడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. కానీ.. ఇలాబిస్కట్ వేసే పథకానికి సంబంధించి.. కాంగ్రెస్ చాలా నీతులు చెబుతోంది. వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల గృహిణుల ఖర్చులు పెరుగుతున్నాయట. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడడం అనేది కాంగ్రెస్ లక్ష్యమట. అందుకోసం ఈ పథకం తెస్తున్నారట.
రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయి గనుక.. ప్రజలకు డబ్బులు పంచిపెడతాం అని చెప్పే అసమర్థపు చేతకాని ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వచ్చినట్టుగా కనిపిస్తోంది. ధరలు తగ్గించడానికి ఏం చేస్తాం అనేది చెప్పకుండా ఓట్లు దండుకోవడానికి డబ్బు పంచుతాం అని చెప్పడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు మార్గాలు చూపించకుండా.. ఎలాంటి పర్పస్, కారణం లేకుండానే తలా రెండువేలు ఇచ్చేస్తాం అనడం ఓటుబ్యాంకు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా కనిపిస్తోంది.