రిమోట్ ఓటింగ్ అంటే భయమెందుకు ?

తమ సొంత నియోజకవర్గాల్లో, ఎన్నికల సమయానికి భౌతికంగా ఉండలేని వ్యక్తులు కూడా దేశంలోని ఇతర ప్రాంతాల్లోంచి అయినా ఓటు వేయడానికి అవకాశం కల్పించే రిమోట్ ఓటింగ్ విధానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. దేశంలో…

తమ సొంత నియోజకవర్గాల్లో, ఎన్నికల సమయానికి భౌతికంగా ఉండలేని వ్యక్తులు కూడా దేశంలోని ఇతర ప్రాంతాల్లోంచి అయినా ఓటు వేయడానికి అవకాశం కల్పించే రిమోట్ ఓటింగ్ విధానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. దేశంలో ఓటింగ్ శాతం పెంచడానికి, ఓటింగ్ లో పాల్గొనడం అనేది ప్రజలకు ఆర్థికభారం, ఇబ్బందికరం కాకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ఈ ఆలోచన చేస్తోంది. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఈ రిమోట్ ఓటింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొందరు నాయకులు రిమోట్ ఓటింగ్ విధానంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా.. దీనిని వ్యతిరేకిస్తుండడమే తమాషా!

ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి ప్రాంతానికి చెందిన ప్రజలు రకరకాల వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీద అనేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు. ఆధునిక తరానికి చెందిన రకరకాల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికీ వారివారి స్థానిక ఊర్లలోనే దక్కడం అనేది అసాధ్యం. అందరూ ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారే. ఇలాంటి కోట్లాది మంది ఓటర్లకు ఎన్నికల సమయంలో వారి స్వగ్రామాలకు వెళ్లి ఓట్లు వేయడం అనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు, సెలవులు పెట్టాల్సిన అవసరం పరంగా కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ విధానం ప్లాన్ చేస్తున్నది.

ఈ పద్ధతిలో హైదరాబాదుకు చెందిన ఓటరు ఢిల్లీలో పనిచేస్తుంటే గనుక.. ఎన్నికల పోలింగ్ రోజున ఢిల్లీలోనే పోలింగ్ బూత్ కు వెళ్లి.. హైదరాబాదులోని తన ఓటును వినియోగించుకోవచ్చు. ఇందుకు ముందుగా రిజిస్టరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతి అమల్లోకి రావడం వల్ల.. విద్యావంతుల కేటగిరీలో ఓటింగ్ శాతం బాగా పెరుగుతుంది. ఈ రిమోట్ ఓటింగ్ అనేది ప్రస్తుతం దేశీయంగా మాత్రమే ఆలోచేన చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారు అక్కడినుంచి ఓటు వేయడానికి కుదరదు. అయితే ప్రతిపక్షాలు చాలా మంది ఈసీ ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు. 

ఈ పద్ధతి వద్దే వద్దు అని గతంలోనే కాంగ్రెస్ ఈసీకి లేఖ రాసింది. భారాస ప్రతినిధి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా రిమోట్ ఓటింగ్ వద్దంటున్నారు. అయితే ఆయన పూర్తి అవగాహన లేకుండానే.. విదేశాల్లో కూర్చుని ఓటు వేసే పద్ధతి మంచిది కాదని అంటుండడం విశేషం. వరుసగా రెండుసార్లు తమ రాష్ట్రంలో అఖండ మెజారిటీలతో గెలిచిన భారాస ప్రతినిధి.. హ్యాకింగ్ కు గురవుతున్నట్టుగా ఈవీఎం లమీదనే అనుమానాలున్నాయనే నిరాధార ఆరోపణ చేయడం విశేషం. 

రిమోట్ ఓటింగ్ అనేది ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది. మరింత ఎక్కువ మంది విద్యావంతులు, ఇతర ప్రాంతాల్లో బతుకుతెరువు రీత్యా ఉద్యోగాలు చేసే వాళ్లు ఓట్లు వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇదే ప్రమాద సంకేతం అన్నట్టుగా కొన్ని పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో మాత్రం అర్థం కావడం లేదు.