ఎన్నికల సమరానికి జనసేనాని పవన్‌కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకు న్నారు. అయితే ఎప్పటి నుంచి అనేది ఇంకా ప్రకటించలేదు. ఈ లోపే జనసేన నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల 24 నుంచి నారసింహయాత్ర తలపెట్టడం విశేషం. తెలంగాణలోని ధర్మపురి నారసింహస్వామి ఆలయ సందర్శనతో యాత్ర మొదలై… మొత్తం 32 క్షేత్రాల సందర్శనతో పూర్తి అవుతుంది.
ప్రజల ఆశీస్సులకు ముందు, దైవం దీవెనలు పొందాలనే ఆలోచన కనిపిస్తోంది. ప్రజలపై పవన్‌కు పెద్దగా నమ్మకం లేదనే సంగతి ఇటీవలే ఆయనే బహిరంగంగా బయట పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని, సమాజమే దేవాలయం అనే డైలాగ్స్ నేతల నుంచి రావడం తరచూ వింటుంటాం. కానీ పవన్ మాత్రం గతానుభవాల దృష్ట్యా ప్రజల్ని మాత్రమే నమ్ముకుంటే మునిగిపోతామని భావిస్తున్నారు.
అందుకే 2024 ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. దైవం పట్ల అచంచల విశ్వాసం పవన్‌లో మెండు. అందుకే ఆయన ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా ముందుగా దైవం ఆశీస్సులు పొందుతుంటారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. దైవం ఆశీస్సులు ఉంటేనే ఆకాంక్షలు నెరవేరుతాయనే ప్రగాఢ నమ్మకమే ఆయన్ను ముందుకు నడిపిస్తోంది.
తాజాగా చేపట్టే నారసింహయాత్రతో తనలో మానసికంగా కొత్త శక్తి వస్తుందనే నమ్మకాన్ని ఎవరు కాదనగలరు.