సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో టీడీపీ అభ్యర్థులపై రోజుకో కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. ఈ దఫా కడప జిల్లాపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, కడప నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులుగా వరదరాజులరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కమలాపురం నుంచి సీఎం జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించాలని పరితపిస్తున్న రవీంద్రనాథ్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ పట్టుదలతో వుంది.
కమలాపురంలో వీరశివారెడ్డికి టీడీపీ టికెట్ ఇస్తే… కథ వేరే వుంటుందని ఆ పార్టీ నమ్ముతోంది. వీరశివారెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం తమ ఎమ్మెల్యేకు బరువే అనే టాక్ వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఇక ప్రొద్దుటూరులో వరదరాజులరెడ్డికి టికెట్ ఇస్తే టీడీపీ పరిస్థితి మెరుగవుతుందనడంలో సందేహం లేదు. అయితే పార్టీ ఫండ్ దగ్గరే పేచీ వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వరదరాజులరెడ్డి సుమారు రూ.30 కోట్లు అడుగుతున్నారని, అంత ఇవ్వలేమని టీడీపీ అధిష్టానం చెబుతున్నట్టు సమాచారం.
ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు అభ్యర్థి అవుతారని విస్తృత ప్రచారం సాగుతోంది. అప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ పరిస్థితి ఏంటనే చర్చ కూడా లేకపోలేదు. ఇక కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డిని కడపకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు కడపలో కూడా మంచి పట్టు వుందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కడప జిల్లాలో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరి మన పరిస్థితి ఏమిటి ఒంకాయ్ ?