డిసెంబర్..జనవరి..ఇప్పుడు లేటెస్ట్ డేట్ ఫిబ్రవరి నెలాఖరు. సమంత – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో శివనిర్వాణ రూపొందిస్తున్న ఖుషీ సినిమా బ్యాలన్స్ షూట్ కు లేటెస్ట్ డేట్ ఇది.
సమంత కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖుషీ సినిమా అర్థాంతరంగా ఆగింది. దాదాపు ముఫై నుంచి నలభై రోజుల షూటింగ్ బకాయి వుండిపోయింది. సమంత పూర్తి ఆరోగ్యంతో వస్తేనే ఈ వర్క్ పూర్తవుతుంది.
ప్రస్తుతం కొంత మేరకు సమంత ఆరోగ్యం కుదుటపడింది. కానీ శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి వుంది. ఈ నెల మూడో వారం నుంచి శాకుంతలం సినిమా ప్రమోషన్లు కాస్త గట్టిగా చేయాలని సమంత అనుకుంటున్నారు. ఇందుకోసం మూడు వారాల సమయం కేటాయించారు. శాకుంతలం విడుదల తరువాతే ఖుషీ సినిమా సెట్ మీదకు సమంత వస్తారని తెలుస్తోంది.
ఖుషీ సినిమా విడుదలను సమ్మర్ కు ఫిక్స్ చేసుకున్నారు నిర్మాతలు మైత్రీ మూవీస్. ఫిబ్రవరి నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభమైనా కనీసం నెలరోజులు పైనే పడుతుంది ప్రొడక్షన్ పూర్తి కావడానికి. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ వుండనే వుంటుంది. అందువల్ల సమ్మర్ డేట్ కు ఖుషీ రెడీ అయిపోవచ్చు.