బాలకృష్ణ కొత్త సినిమా రూలర్ విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే రెండు ట్రైలర్లు బయటకొచ్చాయి, బాలయ్య గెటప్పులపై లెక్కలేనన్ని సెటైర్లు పడుతున్నాయి. విగ్గుల విషయానికొస్తే బాలయ్య టేస్ట్ కి అభిమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం బాలయ్య అద్దంలో చూసుకోడా అంటూ అభిమానులే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి.
పోనీ తప్పంతా దర్శకుడిపై వేద్దామనుకున్నా.. కెఎస్ రవికుమార్ గత చిత్రాలను చూస్తే ఆయనది అంత బ్యాడ్ టేస్ట్ కాదు అని అర్థమవుతుంది. ముత్తు, నరసింహ సినిమాల్లో రజనీకాంత్ ని ఓ రేంజ్ లో చూపించాడు రవికుమార్. అంతెందుకు ఆమధ్య వచ్చిన లింగా సినిమా రిజల్ట్ తేడా కొట్టినా రజినీ గెటప్పులు అదిరిపోయాయి.
ఇక రజినీకాంత్ విషయానికొద్దాం. రజనీ కొత్త సినిమా కూడా పోలీస్ స్టోరీనే. ఆమధ్య వచ్చిన స్టిల్స్, మోషన్ పోస్టర్ చూసి దర్శకుడు మురుగదాస్ ఏదో గ్రాఫిక్స్ మాయాజాలం చేసుంటాడని అనుకున్నారు కానీ, రాత్రి రిలీజైన ట్రైలర్ చూస్తే సూపర్ స్టార్ గ్రేస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ స్టయిల్, మేనరిజమ్స్ ఏమాత్రం తగ్గలేదు. పోనీ అది కేవలం రజనీ సొంతమైన స్టైల్ అనుకుందాం. డ్రస్సింగ్, హెయిర్ స్టైల్ విషయంలో కూడా రజనీ మరోసారి చించేశారు, కుర్ర హీరోలకు పోటీగా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.
సొంత జుట్టు ఉన్నవాళ్లు ఒకే హెయిర్ స్టైల్ మెయింటెన్ చేయొచ్చు కానీ, విగ్గులు అవకాశం ఉన్నవాళ్లు వారికి నచ్చినట్టు, ట్రెండ్ కి తగ్గట్టు చెలరేగిపోవచ్చు. బాలకృష్ణ, రజనీకాంత్ ఇద్దరివీ విగ్గులే కాబట్టి ఇద్దరికీ ఆ అడ్వాంటేజీ ఉంది. కానీ బాలకృష్ణ ఈ విషయంలో పూర్తిగా ఫెయిలయ్యారని రూలర్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, ఇక రజనీకాంత్ విషయానికొస్తే విగ్గుతో చెలరేగిపోయారు సూపర్ స్టార్.
రూలర్ సినిమా కోసం వెయిట్ తగ్గిన బాలకృష్ణ డ్రస్సింగ్, హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం వెనకపడ్డారు. అదే పోలీస్ స్టోరీతో వస్తున్న రజనీకాంత్ మాత్రం ట్రైలర్ లో ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. తనకంటే పదేళ్లు పెద్దవాడైనా రజనీని బాలయ్య ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వయసుకు తగ్గ పాత్రలు ఎలాగూ చేయడం లేదు, కనీసం చేసే పాత్రల్లోనైనా వయసు కనిపించకుండా చూసుకోవడం హీరోల బాధ్యత.