'1971 జనాభా ఆధారంగా..1977లో లోక్ సభ నియోజకవర్గాలను సవరించాం. అప్పటికి దేశ జనాభా యాభై ఆరు కోట్లు. ఇప్పుడు దేశ జనాభాకు అనుగుణంగా లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచాల్సి ఉంది, కనీసం వెయ్యి నియోజకవర్గాలను చేసి అంతమంది లోక్ సభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అప్పుడే ప్రజలకు ఎంపీలు అందుబాటులో ఉండగలరు, ఆ మేరకు రాజ్యసభ సభ్యుల సంఖ్యను కూడా పెంచాలి.. ' అని సూచించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.
రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞుడు, మేధావి అయిన ప్రణబ్ సూచనలు విలువైనవే. రాష్ట్రపతిగా కూడా చేసిన ఆయన సూచనలు బాగానే ఉన్నాయి. అయితే సగటు మనిషి కోణం నుంచి ఆలోచిస్తే.. ఎంపీల సంఖ్య పెరిగిన కొద్దీ దేశానికి భారం అయ్యేలానే ఉంది తప్ప, ఎంత వరకూ ప్రయోజనం అనేది ప్రశ్నే!
ఇప్పుడే ఎంపీలు ప్రజలకు ఎవ్వరూ అందుబాటులో ఉండరు. ఎమ్మెల్యేలు అయినా కాస్త పలుకుతారు కానీ, ఎంపీలు మాత్రం తమది వేరే లోకం అన్నట్టుగా ఉంటారు. ఎంత మంది ఎంపీలు తమ నియోజకవర్గాల్లో కనీసం పర్యటిస్తూ ఉన్నారు? ఐదేళ్ల పదవీ కాలంలో వాళ్లు నియోజకవర్గం పరిధిలో ఎన్ని రోజులు తిరుగుతూ ఉన్నారు? అయితే ఢిల్లీకి పరిమితం కావడం, లేకపోతే తమ వ్యక్తిగత వ్యవహారాలను చూసుకోవడమే ఎంపీల పనైపోయింది. వీళ్ల వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం ఉంది? అనేది క్షేత్ర స్థాయి పరిశీలనతో తెలుసుకోవచ్చు. వీళ్ల చేతికి ఇచ్చే నిధులను కలెక్టర్ల చేతికి ఇచ్చినా మంచిగానే ఖర్చు పెడతారు. వీళ్ల ప్రొటోకాల్స్ కు వీళ్లు జీతభత్యాలకూ ఏమీ కొదవలేదు. అంత చేస్తే వీరు ప్రజలకు అందుబాటులో ఉండరు.
అలాంటి వారు ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారనుకోంటే, వారి సంఖ్యను వెయ్యికి పెంచాలంటూ ప్రణబ్ సూచిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేకుండా ఎంత మంది ఉంటే ఏం ప్రయోజనం సార్?