సంక్రాంతికి అల్లుడొస్తాడనుకుంటే మొగుడు వచ్చాడు. ఇది సరిలేరు నీకెవ్వరు సినిమాలో డైలాగ్. మహేష్ ఫ్యాన్స్ దీన్నే హైలెట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మొగుడొస్తున్నాడంటూ పోస్టర్లు పెడుతున్నారు. అయితే దీనికి కౌంటర్ గా బన్నీ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. సంక్రాంతికి రావాల్సింది మొగుడు కాదు, మగాడు అంటూ కొత్త పోస్టర్లు పెడుతున్నారు. దీంతో బన్నీ, మహేష్ అభిమానుల మధ్య కొత్త రచ్చ మొదలైంది.
నిజానికి ఈ రగడ మొదలైంది సోషల్ మీడియాలో కాదు. విశాఖపట్నంలో ముందుగా ప్రారంభమైంది, తర్వాత మెల్లగా సోషల్ మీడియాకు పాకి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అంతా ఒకర్నొకరు తిట్టుకునే స్థాయికి చేరిపోయింది. విశాఖలోనే ఓ థియేటర్ ముందు సరిలేరు నీకెవ్వరు ఫ్లెక్సీ పెట్టారు. సంక్రాంతికి మొగుడొస్తున్నాడనేది అందులో క్యాప్షన్.
ఇది పెట్టిన కొద్దిసేపటికే ఆ పోస్టర్ ను పీకేశారు బన్నీ ఫ్యాన్స్. సంక్రాంతికి రావాల్సింది మొగుడు కాదు, మగాడు అంటూ మరో ఫ్లెక్సీ పెట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. సదరు ఫ్లెక్సీ పెట్టే స్థలం తమదంటే తమదంటూ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఆ ఫ్లెక్సీలు కాస్తా సోషల్ మీడియాకు పాకడంతో గొడవ వైరల్ అయింది.
ఈ గొడవ బయటకొచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది. పైకి కనిపించని ఇలాంటి ఘర్షణలు మండల స్థాయి నుంచి చూసుకుంటే కోకొల్లలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి తమ సినిమానే హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్, తమ సినిమానే ముందు వస్తోందని కాబట్టి తమదే పైచేయి అంటూ మహేష్ ఫ్యాన్స్ వాదులాడుకుంటున్నారు. సంక్రాంతి వరకు ఈ రచ్చ తప్పదేమో.