టీడీపీ ఎమ్మెల్యేలు బఫూన్లు…ఈ మాటను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికి రెండుసార్లు అన్నారు. ఒకసారి ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు సీఎంగా మరోసారి టీడీపీ సభ్యులపై పరుష పదజాలాన్నివాడారు.రెండు దఫాలు ఏఏ సందర్భాల్లో జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారో తెలుసుకుందాం.2014లో చంద్రబాబు సర్కార్ కొత్తగా కొలువుదీరిన వేళ. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అప్పటికి జగన్‌కు నిండా 40 ఏళ్లు. తనతో కలపి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని గట్టి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి మొదటిసారి ఎంటరయ్యాడు. ఎలాగైనా జగన్‌పై అటాక్ చేసి బెదరగొట్టాలని టీడీపీ సర్కార్ మొదటి రోజు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని అసెంబ్లీ వేదికగా ఆరోపించారు.
ఆ తర్వాత జగన్ ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. తనపై న్యాయ విచారణ జరుగుతోందని, అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని వాపోయాడు. అటు వైపు నుంచి యధావిధిగా జగన్ ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో జగన్‌కు కోపం వచ్చింది. తన మాటలు వినడానికి ఓపిక లేకపోతే ఎలా అని తీవ్రస్థాయిలో నిలదీశాడు. ఊహూ, వారిలో మార్పు రాలేదు.
“చేయని తప్పునకు మీ అందరి బఫూన్లతో ఇలా అనిపించుకోవాలా? నాకెలా ఉంటుంది?” అని ధ్వజమెత్తాడు.దీంతో అసెంబ్లీ గందరగోళంగా మారింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పోడియాన్ని పాలకపక్ష టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. అసలేం జరుగుతున్నదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
“జగన్‌మోహన్‌రెడ్డి గారూ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు బాధ్యత గల ప్రతిపక్ష నేత , దయచేసి ఆ మాటలను వెనక్కి తీసుకోండి” అని స్పీకర్ పదేపదే జగన్‌ను కోరినా ప్రయోజనం లేకపోయింది.2019, డిసెంబర్ 16 అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
శాసనసభలో సోమవారం బిల్లు ప్రవేశ పెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసింది తామంటే తామని సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.చరిత్రాత్మక బిల్లు తెస్తుంటే బఫూన్లలా వ్యవహరిస్తున్నారని టీడీపీ సభ్యులపై సీఎం మండిపడ్డాడు.
ఎస్సీ, ఎస్టీల కోసం వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సభలో బిల్లులు పెట్టి మాట్లాడుతుంటే తన మాటలు ప్రజలకు ప్రజల్లోకి వెళ్లకూడదనే దుర్బుద్ధితోనే వారంతా వెల్‌లోకి కేకలు వేస్తున్నారని, సిగ్గులేని రీతిలో వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించాడు.వీళ్లా ఎమ్మెల్యేలు? నాయకులు? పాలకులుగా ఉండే అర్హత వీరికి ఉందా అని సీఎం ప్రశ్నించాడు. అలాంటి వారిని ముందు పెట్టి, వెనక నుంచి చంద్రబాబు నవ్వుతున్నారని సీఎం మండిపడ్డారు.
అంతకు ముందు చంద్రబాబుకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఇచ్చాడు. అయితే బిల్లుపై మాత్రమే మాట్లాడాలంటూ మైక్ కట్ చేశాడు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సీఎం మాట్లాడుతున్నంత సేపూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు.ఇప్పటికి టీడీపీ సభ్యులను అసెంబ్లీ వేధికగా జగన్ రెండుసార్లు బఫూన్లని తిట్టాడు. భవిష్యత్‌లో మరెన్నిసార్లు ఇలా జగన్ నోట ఆ మాట వినాల్సి వస్తుందో మరి. ఇదండీ అసెంబ్లీలో టీడీపీ బఫూన్ల కథాకమామీషూ…