బాలయ్య ఇప్పుడో కొత్త ట్రెండ్ షురూ చేశారు. తన ఆగిపోయిన సినిమాలు, ఎడిటింగ్ లో కట్ అయిపోయిన వీడియోల్ని ఫ్రెష్ గా ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే నర్తనశాల షార్ట్ ఫిలింను రుచిచూపించిన బాలయ్య.. ఇప్పుడు తన నుంచి మరో ఆణిముత్యాన్ని బయటపెట్టారు.
భీష్ముడి గెటప్ లో ఉన్న స్టిల్స్ ను రిలీజ్ చేశారు బాలయ్య. ఇదేదో బాలయ్య కొత్త సినిమా గెటప్ అనుకోవద్దు. అప్పుడెప్పుడో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన ఎన్టీఆర్-కథానాయకుడు అనే సినిమాలో ఎడిటింగ్ లో లేపేసిన గెటప్ ఇది.
ఆ సినిమాలో దాదాపు 60 గెటప్స్ వేయాలని ఉబలాటపడ్డారు బాలయ్య. అయితే తన అవతారాలకే రన్ టైమ్ అయిపోతుందని భావించి కుదించారు. అప్పటికీ నిడివి కుదరక మరికొన్ని గెటప్స్ కట్ చేసి అవతల పడేశారు. అలా తీసేసిన గెటప్పే ఈ భీష్ముడి పాత్ర. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ స్టిల్స్ రిలీజ్ చేశానంటున్నారు బాలయ్య.
గతేడాది ఇలానే తను తీసిన నర్తనశాల సినిమా ఫూటేజ్ ను బయటకు వదిలారు బాలయ్య. అటుఇటు చేసి, దానికి పాత నర్తనశాల క్లిప్పింగ్స్ జోడించి మరీ రిలీజ్ చేశారు. అలా డబ్బులు పిండుకునే ప్రయత్నం చేస్తే అది కాస్తా బెడిసికొట్టింది. ఈసారి అలాంటి ప్రయత్నాల జోలికి వెళ్లకుండా ఇలా స్టిల్స్ రిలీజ్ చేసి సరదా తీర్చుకున్నారు.
చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ను గట్టిగా ఫాలో అయ్యేలా ఉన్నారు ఈ సీనియర్ హీరో. బాలయ్య కెరీర్ లో రిలీజ్ అవ్వని, షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇలా వీడియోలు, ఫొటోలు రూపంలో బయటపడేలా ఉన్నాయి.
గతంలో బాలయ్య, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో “విక్రమసింహభూపతి” అనే సినిమా సగం షూటింగ్ పూర్తిచేసుకొని ఆగిపోయింది. పనిలోపనిగా, ఇదే ఊపులో ఆ సినిమా కూడా రిలీజ్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.