గిల్డ్ వ్యవహారాల పట్ల ఆగ్రహంతో వున్న నందమూరి బాలకృష్ణ ను ప్రసన్నం చేసుకోవడానికి కార్యాచరణ మొదలైంది. ముఖ్యంగా గిల్డ్ కు సారథ్యం వహిస్తున్న దిల్ రాజు పట్ల, ఆయన వ్యవహారాల పట్ల బాలయ్య ఆగ్రహంతో వున్నారని వార్తలు వచ్చాయి.
తమ సినిమా షూట్ స్టార్ట్ చేయకపోతే ఏమవుతుందో అని నిర్మాతలు మైత్రీ మూవీస్ భయపడుతున్నారు. మరోపక్కన బాలయ్య కనుక షూట్ ప్రారంభిస్తే మిగిలిన హీరోలు కూడా అదే బాట పడతారని గిల్డ్ పెద్దలు భయపడుతున్నారు. ముఖ్యంగా తన పరువు పోతుందని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు పరిష్కార మార్గంగా ఈ రోజు జరిగిన గిల్డ్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. బాలయ్యకు నచ్చ చెప్పగల అయిదుగురు నిర్మాత లతో ఓ కమిటీ వేసారు. ఈ కమిటీకి గిల్డ్ సారథి దిల్ రాజు దూరంగా వుండడం విశేషం.
గతంలో బాలయ్య సినిమాలు తీసిన శివలెంక ప్రసాద్ ఈ కమిటీలో వున్నారు. ఈయన అంటే బాలయ్యకు అభిమానం గౌరవం వుంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యతో సినిమా నిర్మించనున్న గారపాటి సాహు మరో సభ్యలు. అలాగే గోపి ఆచంట, అన్నే రమేష్, పి కిరణ్ కూడా సభ్యులుగా వున్నారు.
బాలకృష్ణ తన మీద ఆగ్రహంతో వున్నారని వార్తలు రావడం వల్లనే దిల్ రాజు కమిటీకి దూరంగా వున్నారని తెలుస్తోంది. అలాగే తమ సినిమా వ్యవహారం కావడం వల్ల మైత్రీ మూవీస్ అధినేతలు కూడా దూరంగా వున్నారు.