కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. ఈ ఎన్నికకు సంబంధించి అధికార తెరాసలో అప్పుడే కసరత్తు ప్రారంభం అయింది. స్వాతంత్ర్య అమృతోత్సవాలను ప్రారంభించినప్పుడే.. కేసీఆర్ పార్టీ కీలక నాయకులతో మునుగోడుకు సంబంధించి ప్రాథమికంగా ఒక సన్నాహక సమావేశం పెట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అనవసరంగా హైరానా పడొద్దు, హడావుడి ఆర్భాటాలు వద్దు అని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ.. కమలదళంతో నెక్ట్స్ లెవెల్ కయ్యం పెట్టుకున్న తర్వాత.. తొలిసారిగా ఎదుర్కోబోతున్న ఈ ఎన్నికలో గులాబీని గెలిపించే కీలక సారథ్య బాధ్యతలను కేసీఆర్ ఎవరి భుజాలమీద పెట్టబోతున్నారు. ఈ ఎన్నికలకు ఇన్చార్జి కాబోయేది ఎవరు? అనేది కీలకాంశం. ప్రత్యేకించి మునుగోడు ఎన్నికకు కేటీఆర్ ను ఇన్చార్జిగా ప్రకటించగల ధైర్యం గులాబీ దళపతికి ఉన్నదా అనేది సందేహాస్పదం.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఇది చావో రేవో ఎన్నిక! ఇదేమీ అనుకోకుండా ముంచుకొస్తున్న ఉప ఎన్నిక కాదు. కోమటిరెడ్డి స్వయంగా కావాలని కోరి తెచ్చుకుంటున్న ఉపఎన్నిక! తాను పార్టీ మారడం అనేదే ఒక ఢంకా బజాయింపుగా ఉండాలని కోరుకున్న సిద్ధపడుతున్న ఎన్నిక! ఎంతో కాలంగా కమలం టీంలో చేరడానికి సంకేతాలు ఇస్తున్న కోమటిరెడ్డి, ఇన్నాళ్లకు గ్రహగతులు అన్నీ సవ్యంగా ఉన్నాయని లెక్కవేసుకున్నారో ఏమోగానీ రాజీనామా చేశారు. వ్యూహాత్మకంగా బిజెపి తరఫున మళ్లీ బరిలో తొడకొట్టబోతున్నారు.
అయితే ఇదే మునుగోడు ఉపఎన్నిక గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయి. ‘‘మనం హైరానా పడొద్దు. ప్రత్యర్థులు అయోమయంలో ఉన్నారు. వారి పథకం వికటిస్తుంది. వారు వేసిన ఉచ్చులో వారే పడి కొట్టుకుంటున్నారు. మన పని మనం తాపీగా చేసుకుంటూ పోదాం..’’ అని కేసీఆర్ అనడం అనూహ్యం. కోమటిరెడ్డి అంత వ్యూహప్రకారంగా ఉండగా.. వారు అయోమయంలో ఉన్నట్లుగా చేసిన వ్యాఖ్య.. మేకపోతు గాంభీర్యమా? లేదా, అంచనా వేయడంలో పొరబడడమా అనేది తెలియడం లేదు.
ఇదే సమావేశంలో కొందరు నాయకులు.. మునుగోడు ఉపఎన్నికకు ఇన్చార్జిగా కేటీఆర్ ను నియమించాలని కోరినట్లు వార్తలొచ్చాయి. కేసీఆర్ అందుకు అంగీకరించగలరా? గతంలో పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉంటుందనుకున్న నియోజకవర్గాల ఎన్నికలకు హరీష్ రావును ఇన్చార్జిగా, గెలిచే అవకాశం ఉన్న వాటికి కేటీఆర్ ను ఇన్చార్జిగా నియమించారనే ప్రచారం ఉంది.
మరి మునుగోడు విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కోమటిరెడ్డి ని ఓడించడం కష్టం అని అనుకునే తరుణంలో.. కొడుకు నెత్తిన ఇన్చార్జి బాధ్యత పెట్టి.. ఆయన ఖాతాలో ఓ వైఫల్యాన్ని వేయడానికి దళపతి సిద్ధమేనా? అనేది ప్రశ్నార్థకం. మునుగోడు వ్యూహాలు ముందు ముందు ఎలా సాగుతాయో చూడాలి.