బాలయ్య! మన ‘బ్రీడ్’ ని ఇలాగే బలోపేతం చేయండి

బాలకృష్ణ గారూ! మీ నోటి నుంచి జాలువారుతున్న ఆణిముత్యాలు వింటుంటే మీకు ఒక బహిరంగ ప్రేమలేఖ రాయాలన్న కుతూహలం కలిగింది. మీరు వాడిన కొన్ని పదాలు నిజంగానే విన్నామా లేక అలా వినపడిందా అనే…

బాలకృష్ణ గారూ! మీ నోటి నుంచి జాలువారుతున్న ఆణిముత్యాలు వింటుంటే మీకు ఒక బహిరంగ ప్రేమలేఖ రాయాలన్న కుతూహలం కలిగింది. మీరు వాడిన కొన్ని పదాలు నిజంగానే విన్నామా లేక అలా వినపడిందా అనే డౌటనుమానంతో రివైండ్ చేసి మరీ విని తరించడం జరిగింది. 

ఆహాహా…అస్సలు ఫిల్టర్ లేకుండా, ఏ విధమైన కళ్ళెం లేకుండా..కొన్ని పదాలు వాడడం తప్పా రైటా అనే ఇంగితం కూడా లేకుండా..ఆడవారి ముందే మరొక సుప్రసిద్ధమైన స్త్రీ గురించి మాట్లాడుతూ “పిర్రల మీద కొట్టి” అనే ఎక్స్ప్రెషన్ వాడడంలో మీకు మీరే సాటి. 

“మా నాన్నగారు శ్రీదేవి గారి పిర్రలమీద కొట్టి ఆమెకు యాక్టింగ్ నేర్పారు..” అని అనగలిగారంటే మీరు సామాన్యులు కారు. పైనుంచి ఇది విన్న మీ నాన్నగారికి బహుశా రెండు సందేహాలు రావొచ్చు- ఆయన పట్ల మీకున్న నమ్మకానికి మీ వెన్ను తట్టాలా, లేక శ్రీదేవి గారి గురించి అంత చులకనగా మాట్లాడినందుకు మిమ్మల్ని కూడా పిర్రల మీద కొట్టి మాట్లాడే పద్ధతి నేర్పించాలా అని. 

ఇలాంటి నరం లేని నాలికతో తమరు మీ నాన్నగారి పరువు కూడా తీస్తున్నారని తెలుస్తోందా? 

మరొక ఆణిముత్యం ఎ. ఆర్. రెహ్మాన్ గారి గురించి. ఏంటండీ! తమకి ఆయనెవరో తెలియదా? తెలిసినా పట్టించుకోరా? పదేళ్లకొకసారి హిట్ కొట్టే వాడికి ఆస్కార్ అవార్డా అంటారా? మీ నాన్నగారికి ఇవ్వకపోతే ఏ అవార్డైనా మీ దృష్టిలో ఇంతేనా? భారతరత్న చెప్పుతో సమానం అంటారు..ఆస్కార్ అవార్డు అర్హత లేనివాడికిచ్చారంటారు. 

కరోనా ఫస్ట్ వేవ్ టైములో “శివశంకరీ..” పాడి సరిగమలకి జ్వరం తెప్పించిన మీరు, సెకండ్ వేవ్ టైములో రామదండకం పాడి సంగీతాన్ని వెంటిలేటర్ ఎక్కించిన మీరు ఎ.ఆర్. రెహ్మాన్ గురించి చులకనగా మాట్లాడతారా? నోరు విప్పితే అపస్వరాలు, అపశబ్దాలు పలికే మీరు భారతదేశానికి సంగీతంలో కీర్తి తెచ్చిపెట్టిన ఆస్కార్ స్థాయి సంగీతజ్ఞుడెవరో తెలియదని చెప్పడం మీ అహంకారానికి పరాకాష్ట. 

ఇంకొక ఆణిముత్యం కూడా ఉంది. ఆదిత్య 369 సీక్వెల్లో ఏ యాక్టర్స్ అయినా రిపీట్ అవుతారా అని అడిగితే “టిను ఆనంద్ బతికే ఉన్నాడా? ఆయనదొక క్యారెక్టర్ ఇంపార్టెంటు” అని వాకృచ్చారు. టిను ఆనంద్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సామాన్య ప్రేక్షకులకి ఆయన ఉన్నదీ లేనిదీ అనుమానం రావొచ్చేమో గానీ, ఆయనతో పని చేసిన మీకు తెలియకపోవడం కాస్త వింతే. పైగా “బతికున్నాడా..” అంటూ ఆ 75 ఏళ్ల ఆర్టిస్ట్ గురించి మాట్లాడడం మీ వయసుకు తగిన వ్యవహారం కాదు. 

ఏ రకంగా చూసుకున్నా తమరు మీకంటే సీనియర్ ఆర్టిస్ట్ అయిన శ్రీదేవి గారికి గౌరవం ఇవ్వరు, మీకంటే ఖ్యాతి తెచ్చుకున్న రెహ్మాన్ ని లెక్కచెయ్యరు, మీకంటే వయసులో పెద్దవాడైన టిను ఆనంద్ కి విలువివ్వరు…ఇందుకు కాదు మీ మీద మాకు పిచ్చెక్కే అభిమానం. 

ఇలాంటి మాటలతోటే మన బ్లడ్ ని, బ్రీడ్ ని ఇంకా బలోపేతం చేయండి. 

సుకుమార్ బాబు రంగినేని