ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యానికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య సమాచార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తన అన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై సోదరి ఎస్పీ శైలజ ఉదయం చెప్పిన మాటలను ఆయన తనయుడు చరణ్ సాయంత్రం ఖండించారు. వెంటిలేటర్ తొలగించారని ఎస్పీ శైలజ చెప్పడాన్ని ఆయన పరోక్షంగా అందులో నిజం లేదని చెప్పారు. తన తండ్రి ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని చరణ్ స్పష్టం చేశారు.
చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, ఐసీయూలోనే ఉంచామని ఆస్పత్రి వర్గాలు నిన్న సాయంత్రం బులెటిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో బాలు అభిమానులు, సంగీత ప్రియులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం బాలు చెల్లెలు, ప్రముఖ గాయని శైలజ ఓ ఆడియో విడుదల చేశారు.
ఇందులో ఆమె బాలు అభిమానుల ఆందోళన తగ్గించే ప్రయత్నం కనిపించింది. తన అన్నయ్య ఆరోగ్యం రోజురోజుకూ మెరుగు అవుతోందని, వెంటిలేటర్ కూడా తొలగించారని చెప్పడంతో ప్రతి ఒక్కరిలో కాస్త ధైర్యం వచ్చినట్టైంది. గాన గంధర్వుడికి ఏమీ కాదులే అనే భరోసాను శైలజ నింపారు.
ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. దీనికి కారణం ఎస్పీ బాలు తనయుడు తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో తన తండ్రి ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నాడని చెప్పుకొచ్చారు. నిన్నటికి, ఈ రోజుకు ఏమంత తేడా లేదని ఆయన పేర్కొన్నారు. తన తండ్రికి వెంటిలేటర్ తొలగించారనే వార్తల్లో నిజం లేదని చరణ్ వివరణ ఇచ్చారు. మరి ఉదయం ఎస్పీ శైలజ ఎందుకలా చెప్పినట్టు? కుటుంబ సభ్యుల మధ్య ఎందుకీ సమాచార లోపం? అంతా గందరగోళంగా తయారైంది.