ఏరోజుకారోజు ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ప్రకటన చేస్తున్నప్పటికీ ఎస్పీ బాలుపై సోషల్ మీడియాలో పుకార్లు ఆగడం లేదు. కరోనాబారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ లెజెండరీ సింగర్ ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఆయన బాగున్నారని ఒకరు, ప్రాణాపాయంలో ఉన్నారని మరొకరు.. ఎవరికి నచ్చినట్టు వారు వార్తలు వండేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు బాలు కుమారుడు ఎస్పీ చరణ్ రోజుకోసారి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తాజాగా బాలు ఆరోగ్యం కుదుటపడిందని, ఆయనకు వెంటిలేటర్ తీసేశారని, త్వరలో జనరల్ వార్డులోకి షిప్ట్ చేస్తారంటూ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. బాలు సేఫ్, బాలు ఈజ్ బ్యాక్ అంటూ హెడ్డింగులు కూడా పెట్టారు.
ఇది సంతోషించాల్సిన విషయమే అయినా సరైన సమాచారం కాదు. దీంతో మరోసారి చరణ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. నాన్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు, నిన్నటికి ఈరోజుకి ఆయన ఆరోగ్య పరిస్థితిలో వచ్చిన మార్పేమీ లేదు. ఆయన వెంటిలేటర్ పైనుంచి బైటకు రావాలనే మేమూ ఆకాంక్షిస్తున్నామంటూ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విషయంలో కూడా ఇలాంటి అత్యుత్సాహమే రాజ్యమేలింది. కొంతమంది మీడియా వ్యక్తులు, రాజకీయ నాయకులు కూడా ప్రణబ్ కి నివాళులర్పించేశారు. తీరా చూస్తే.. ఆయన కోలుకుంటున్నారని కుమార్తె చెబుతోంది. తనను విసిగించొద్దని, తనకు పదే పదే పోన్ లు చేయొద్దని, ఆస్పత్రి నుంచి వచ్చే అత్యవసర ఫోన్లు ఆగిపోతాయని కన్నీటిపర్యంతమైంది. ఇప్పుడు బాలు విషయంలో కూడా సోషల్ మీడియాలో అదే అత్యుత్సాహం కనిపిస్తోంది.