ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలతో పాటు బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందని చాన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తూ వచ్చాయి. అన్నీ అనకున్నట్టు జరిగితే జనవరి 15న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడీ ప్రచారమే నిజమైంది. బంగార్రాజు సినిమా సంక్రాంతికే వస్తోంది. ఈరోజు టీజర్ రిలీజ్ చేసి మరీ విడుదలను పక్కా చేశారు.
నిజానికి బంగార్రాజు రాకను కాస్త ముందుగానే చెబుదాం అనుకున్నారు. కానీ భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్ సినిమాల మధ్య నడిచిన వివాదంలోకి దూరడం ఇష్టంలేక కాస్త తగ్గారు. ఎన్నో మలుపుల తర్వాత భీమ్లానాయక్ రేసు నుంచి తప్పుకుంది. ఇక రేపోమాపో బంగార్రాజు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేద్దాం అనుకునే టైమ్ కు, ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ కూడా తప్పుకుంది.
ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే వార్త బయటకు రావడం, బంగార్రాజు సినిమా సంక్రాంతికి వస్తుందంటూ టీజర్ రిలీజ్ అవ్వడం ఒకే రోజు, దాదాపు ఒకే సమయంలో జరిగాయి. అలా ప్రీ-ప్లాన్డ్ గా, పక్కా ప్రణాళికతో తన బంగార్రాజును రంగంలోకి దించుతున్నాడు నాగ్.
ఇక టీజర్ విషయానికొస్తే.. నాగార్జున తన ఇంట్లో ల్యాండ్ అవ్వడం, నాగచైతన్యగా మారి బయటకు రావడంతో టీజర్ మొదలైంది. హీరోయిన్ కృతి శెట్టిని సర్పంచ్ గా చూపించారు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సోగ్గాడే చిన్ని నాయనా తరహాలోనే ఫన్, లవ్, రొమాన్స్, యాక్షన్ మిక్స్ చేస్తూ బంగార్రాజు సినిమా తెరకెక్కింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టుడియోస్, జీ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.