తొలి సారి కాస్త పాజిటివ్ గా మాట్లాడినట్టుగా ఉన్నాడు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్. 2022తో మహమ్మారిగా కోవిడ్ ప్రభావం గతిస్తుందని ఈ సైంటిస్ట్ అంచనా వేశాడు. అయితే ఈ విషయంలో ప్రపంచ దేశాలు కలిసి పని చేయాలని అన్నాడు. అన్ని దేశాలూ పరస్పరం సహకరించుకుని.. ప్రపంచ జనాభాలో కనీసం 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తే.. మహమ్మారిగా కోవిడ్ ప్రభావం ముగుస్తుందని ఆయన అంచనా వేశారు.
ఇప్పటికే డబ్ల్యూహెచ్వో సైంటిస్టులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ ఎండెమిక్ స్థాయికి చేరుకుందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వేరియెంట్ ను ఒక టీకాతో పోలుస్తున్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు పెరగడం అంటే.. హెర్డ్ ఇమ్యూనిటీని ప్రపంచం సాధించుకుంటున్నట్టే అనే అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు.
వైరాలజీపై అధ్యయనాలు చేసిన వారు కూడా.. మానవాళి మధ్యన రెండేళ్లను పూర్తి చేసుకుంటున్న కరోనా ప్రభావం ఇక తగ్గిపోతుందని, పరిమితం అవుతుందని .. కరోనా పూర్తిగా నశించకపోయినా, దాని దుష్ఫ్రభావాలు మాత్రం తగ్గిపోతాయనే తరహాలో స్పందిస్తున్నారు.
ఈ క్రమంలో డబ్ల్యూహెచ్వో చీఫ్ స్పందిస్తూ.. 2022తో మహమ్మారిగా కరోనా ప్రభావం ముగుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో కరోనా తో పాటు ఆరోగ్య పరమైన ఇతర ఛాలెంజ్ లు కూడా ప్రపంచం ముగింట ఉన్నాయని టెడ్రెస్ అంటున్నారు.
కరోనా వైరస్ ప్రభావం వల్ల.. చాలా మంది జనరల్ వ్యాక్సినేషన్ లు చేయించుకోలేదని, లాక్ డౌన్లు.. ఇతర పరిస్థితులన్నింటి వల్లా.. కుటుంబ నియంత్రణతో పాటు బోలెడన్ని అంశాలు గతి తప్పాయని టెడ్రోస్ అంటున్నారు. అలాగే మలేరియా నివారణకు తొలి సారి అందుబాటులో వస్తున్న వ్యాక్సిన్ ను కూడా మానవాళి ఉపయోగించాలని టెడ్రెస్ అంటున్నారు.
ప్రతియేటా మలేరియా కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు దాని వ్యాక్సిన్ ఉపకరిస్తుందన్నారు. పోలియో ను పారద్రోలే విషయంలో ప్రపంచం దాదాపు ఇప్పటికే విజయం సాధించిందని టెడ్రోస్ అన్నారు.