ఎట్టకేలకు టికెట్ రేట్లపై స్పందించిన జగన్

భీమ్లానాయక్ విడుదల టైమ్ నుంచి టికెట్ రేట్లపై వివాదం కొనసాగుతోంది. దీనిపై చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ లాంటి హీరోలు కమ్ పొలిటీషియన్ అయితే గీత దాటి మరీ వ్యాఖ్యలు…

భీమ్లానాయక్ విడుదల టైమ్ నుంచి టికెట్ రేట్లపై వివాదం కొనసాగుతోంది. దీనిపై చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ లాంటి హీరోలు కమ్ పొలిటీషియన్ అయితే గీత దాటి మరీ వ్యాఖ్యలు చేశారు. మొత్తం వ్యవహారాన్ని కెలికి కంపు చేశారు. అయితే ఇంత జరిగినప్పటికీ ఎప్పుడూ, ఎక్కడా ఈ అంశంపై స్పందించలేదు ముఖ్యమంత్రి జగన్. ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చింది. టికెట్ రేట్ల అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు జగన్.

“విమర్శించే వాళ్లు ఎంత దూరం వెళ్లారో మీకో విషయం చెబుతాను. పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించేందుకు టికెట్ ధరల్ని నిర్ణయిస్తే, ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రజలంతా గమనించాలి. ఇలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచిస్తారా? పేదల గురించి పట్టించుకుంటారా? ఇలాంటి వాళ్లంతా పేదవాడికి శత్రువులు.”

ఇలా మొదటిసారి టికెట్ రేట్లు అంశంపై స్పందించారు జగన్. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో వైఎస్ఆర్ పెన్షన్ కు సంబంధించి పింఛను మొత్తాన్ని పెంచే కార్యక్రమంలో అధికారికంగా పాల్గొన్న ముఖ్యమంత్రి, ఈ వ్యాఖ్యలు చేశారు. అవ్వాతాతలకు పించన్ మొత్తాన్ని 2500 రూపాయలకు పెంచుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

కులమతాలకు అతీతంగా అందరికీ పెన్షన్ అందిస్తూ పాలన సాగిస్తున్నామన్న ముఖ్యమంత్రి, పేదలకు మంచి చేసే ఏ పని చేస్తున్నా ప్రతిపక్షాలకు గిట్టడం లేదన్నారు. ఇంగ్లిష్ మీడియం నుంచి సినిమా టికెట్ రేట్ల వరకు ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్న కొంతమందికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.