అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన నేత. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు కూడా ఏపీ రాజకీయంలో ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. గిరిజన ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ ఉన్న మాధవిని, అరకు నుంచి ఎంపీగా పోటీ చేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.
కిషోర్ చంద్రదేవ్ వంటి రాజకీయ దురంధురుడిని చిత్తుగా ఓడించి .. ఎంపీగా అడుగు పెట్టింది ఈ అనామకురాలు. మాధవి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నా.. ఆమె వరకూ వచ్చే సరికి కేవలం టీచర్ జాబ్ మీద ఆధారపడి బతుకీడుస్తూ వచ్చింది. ఎంపీగా ఢిల్లీలో ఈమె అడుగుపెట్టినప్పుడు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.
మిలియనీర్లు, వ్యాపారస్తులు, రాజకీయ వారసులే.. భారత లోక్ సభ, రాజ్యసభల్లోకి అడుగుపెడతారనే అభిప్రాయాలు బలంగా ఏర్పడిన తరుణంలో, వారందరి మధ్యన గొడ్డేటి మాధవి ఆశ్చర్యపరిచింది. ఆమె ఇంటర్వ్యూలు తీసుకోవడానికి జాతీయ మీడియా ఉత్సాహం చూపించింది. ఆమె జీవన శైలి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయింది.
మరి ఎంపీగా గెలవడం వరకూ కొందరు సామాన్యులుగానే ఉంటారు. ఒక్కసారి గెలిస్తే.. వారి తీరు మారిపోతుంది. వారి జీవన శైలి మారిపోతుంది! ఎంపీగా దాదాపు మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు మాధవి కూడా. మరి ఈ తరుణంలో.. ఆమె ఏం చేస్తున్నారనే అంశం గురించి ఈ రోజు సాక్షి పత్రికలో ఒక ఫొటో ప్రచురితం అయ్యింది.
వరి కోతల పనుల్లో ఎంపీ మాధవి, ఆమె భర్త నిమగ్నమైన దృశ్యమది. ఏదో మీడియా కోసం పోజులివ్వడం కాదు… ఈ భార్యభర్తలు తమ పొలం పని చేసుకుంటూ కనిపించారు. ఎంపీగా ఎన్నికయినా.. తమ జీవన శైలి మారలేదని మాధవి తీరును చూస్తుంటే స్పష్టం అవుతోంది.
ఎంపీలంటే బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టే వాళ్లు, కన్షార్షియంలకు టోపీ పెట్టి తాము విగ్గు పెట్టుకు తిరిగే వాళ్లు, ఎంపీలంటే.. తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఢిల్లీలో లాబీయింగులు చేసుకునే వాళ్లు, ఎంపీలంటే.. రాజకీయ పైరవీ కారులు.. అనే వార్తలు వస్తున్న తరుణంలో.. ఈ గిరిజన ఎంపీ అత్యంత ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది.