న్యూ ఇయర్ వేడుకలు అంటే.. మద్యపానోత్సవానికి పర్యాయపదంగా మారి చాలా కాలమే అవుతూ ఉంది. మద్యం లేని న్యూ ఇయర్ వేడుక అనేది అసంభవంగా మారింది. కుర్రకారూ, పెద్ద వాళ్లు తేడా లేకుండా.. ఎవరి సర్కిల్స్ లో వారు.. ఒకే తరహాలో న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. తాగి స్వాగతం పలకకపోయినా, న్యూ ఇయర్ వస్తుందన్నా.. తాగకపోతే కొత్త సంవత్సరం రాదేమో అనే తరహాలో మద్యపానం సాగడం గమనార్హం.
ఏపీ, తెలంగాణాల్లో న్యూ ఇయర్ సందర్భంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణనే టాప్. ఏపీ పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతోంది. తెలంగాణ పరిధిలో నిన్న ఒక్క రోజే ఏకంగా 171 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు సాగినట్టుగా తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువే!
నిన్న మాత్రమే కాదు.. గత ఐదు రోజులుగా తెలంగాణలో సగటున రోజుకు నూటా యాభై కోట్ల రూపాయలకు పై స్థాయి విలువలోనే మద్యం అమ్మకాలు సాగినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ నెల అంతా కలిపి 3400 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడయ్యిందట. గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఈ సారి అదనంగా ఏడు వందల కోట్ల రూపాయల మద్యం అమ్ముడు కావడం గమనార్హం.
ఇక ఏపీ విషయానికి వస్తే.. తెలంగాణ కన్నా ఈ విషయంలో వెనుకబడి ఉంది. ఏపీలో నిన్న ఒక్క రోజునే 120 కోట్ల రూపాయల స్థాయిలో మద్యం అమ్మకాలు సాగినట్టుగా సమాచారం. జనాభాలో తెలంగాణ కన్నా పెద్దదే అయినా ఏపీ తెలంగాణ కన్నా యాభై కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాల స్థాయిలో వెనుకబడి ఉంది.