మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, ఇతరత్రా మాధ్యమాల వేదికగా చిరంజీవి గొప్పతనాన్ని పలువురు లోకానికి చాటి చెబుతున్నారు. ఈ సందర్భంగా జనసేనాని, మెగాస్టార్ చిరు తమ్ముడు పవన్‌కల్యాణ్ తెలిపిన శుభాకాంక్షల ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటో అందులోని ప్రతి అక్షరం భావోద్వేగాన్ని నింపుకుంది. పవన్‌కల్యాణ్ ప్రకటనలోని ముఖ్యమైన అంశాల్ని తెలుసుకుందాం.
‘చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి స్ఫూర్తి ప్రదాత, ఆదర్శప్రాయులు చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి, ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం.
విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న చిరంజీవి నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి … కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవాగుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. చిరంజీవి గారు మా కుటుంబంలో అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పవన్‌కల్యాణ్ తన అన్న గొప్పతనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
చిరంజీవి నటనా వారసుడిగానే పవన్‌కల్యాణ్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారనే విషయం తెలిసిందే. అయితే పవన్‌కల్యాణ్ తన ప్రతిభతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. నటనలో అన్నకు తగ్గ తమ్ముడిగా అభిమానులను సంపాదించుకున్నారు. అన్న నీడలో ఎదిగిన పవన్… నేడు పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ గురించి చెప్పే ప్రతి మాట విలువైనదిగా అభిమానులు భావిస్తున్నారు.