“హీరోలందు యూట్యూబ్ హీరోలు వేరయా.. విశ్వదాభిరామ..” అంటూ కొత్తగా పద్యం రాసుకోవాలేమో. నిద్రలో కూడా పాన్ ఇండియా పేరు కలవరిస్తూ ప్రతి సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్న మన హీరోలకు.. ఇప్పుడు బెల్లంకొండ రూపంలో పెద్ద పాఠం తెలిసొచ్చింది.
యూట్యూబ్ వేరు.. థియేటర్ వేరు..
బెల్లంకొండ నటించిన కొన్ని సినిమాలకు యూట్యూబ్ లో విపరీతంగా పాపులారిటీ వచ్చింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దీంతో బెల్లంకొండ నటించిన సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో భారీగా డబ్బులొచ్చాయి. ఇవన్నీ చూసిన బెల్లంకొండ, తనకు బాలీవుడ్ లో క్రేజ్ ఉందని భ్రమపడ్డాడు.
అనుకున్నదే తడవుగా తెలుగులో సూపర్ హిట్టయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. పట్టుమని కోటి రూపాయల కలెక్షన్ కూడా రాలేదని ట్రేడ్ టాక్. ఈ దెబ్బతో తిరిగి తెలుగు సినిమాల వైపు వచ్చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్.
సినిమాతో పాటు.. ప్రమోషన్ కూడా ముఖ్యం..
మంచి కథ ఎంచుకొని, భారీ బడ్జెట్ తో చాలామంది సినిమాలు తీస్తారు. కానీ దానికి ప్లాన్డ్ గా ప్రచారం చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయంలో హిందీ ఛత్రపతి యూనిట్ వెనకబడింది. ఉన్నంతలో కొన్ని నగరాలు కవర్ చేసినప్పటికీ, బజ్ వచ్చేలా మూవీకి ప్రచారం కల్పించలేకపోయారు. దీనికి తోడు ఔట్-డేటెడ్ కంటెంట్ ను ఈ తరానికి ఎక్కించాలనే ప్రయత్నం బెడిసికొట్టింది.
కేవలం బెల్లంకొండ సినిమాలకే కాదు.. యూట్యూబ్ లో బాలకృష్ణ, రామ్ లాంటి హీరోల సినిమాలకు కూడా మంచి వ్యూస్ ఉన్నాయి. కానీ ఆ క్రేజ్ తో నేరుగా బాలీవుడ్ లో సినిమా తీస్తే ఏమౌతుందో, బెల్లంకొండ ఉదంతంతో అంతా తెలుసుకున్నారు.