అనారోగ్యానికి గురైన తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించిన అనంతరం ఆమె వెంటే అంబులెన్స్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌కు బయల్దేరారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి హాజరు కావాల్సింది. అయితే సీబీఐ కార్యాలయానికి హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరిన అవినాష్‌రెడ్డికి పులివెందుల నుంచి ఫోన్ కాల్ రావడంతో నిర్ణయం మారిపోయింది.
తల్లి అనారోగ్యానికి గురయ్యారని, పులివెందులలో ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చారని సమాచారం వచ్చింది. ఇప్పటికే ఇదే కేసులో అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి జైల్లో ఉన్నారు. దీంతో తల్లిని చూసుకోడానికి తాను వెళ్లాల్సి వచ్చిందని, మరొకరోజు విచారణకు వస్తానంటూ సీబీఐకి అవినాష్‌రెడ్డి సమాచారం ఇచ్చారు. ఊహించని విధంగా ట్విస్ట్ చోటు చేసుకోవడంలో సీబీఐ కూడా అప్రమత్తమైంది.
హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరిన అవినాష్‌రెడ్డి వాహనాన్ని సీబీఐ అధికారులు కూడా అనుసరించారు. మరోసారి విచారణకు రావాలని నోటీసులు తీసుకునేందుకు ఆగాలని అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు కోరినట్టు వార్తలొచ్చాయి. అయితే తల్లిని చూసిన తర్వాతే, ఏ విషయమైనా మాట్లాడ్తానని వారితో అవినాష్‌రెడ్డి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి తల్లిని మెరుగైన వైద్యం కోసం పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు పయనమయ్యారు. తాడిపత్రి సమీపంలో తల్లిని అవినాష్‌రెడ్డి కలుసుకున్నారు. అమ్మను పరామర్శించిన అనంతరం అదే అంబులెన్స్‌లో అవినాష్‌రెడ్డి కూడా హైదరాబాద్ బయల్దేరారు. హైదరాబాద్‌కు తిరిగి అవినాష్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న సీబీఐ అధికారులు కర్నూలులో ఆగిపోయినట్టు తెలిసింది.
బహుశా ఒకట్రెండు రోజుల్లో విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం వుంది. ఈ రోజు సీబీఐ, అవినాష్‌రెడ్డి మధ్య వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.