ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది బాలీవుడ్ నటి భాగ్యశ్రీ. రాధేశ్యామ్ మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తిచేసిన ఈ సీనియర్ నటి, ప్రభాస్ పై రియాక్ట్ అయింది. మరీ ముఖ్యంగా మైనే ప్యార్ కియా సినిమా చూసిన తర్వాత ప్రభాస్ కు తనపై క్రష్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది.
“ప్రభాస్ నేను నటించిన మైనే ప్యార్ కియా చూశాడు. ఆ సినిమా చూసిన తర్వాత నాపై క్రష్ ఏర్పడిందని చెప్పాడు. ప్రభాస్ తో సెట్స్ లో చాలా బాగుంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎక్కువ సేపు మేం ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం.
నా లాస్ట్ డే షూటింగ్ లో ప్రభాస్ నాకు పెద్ద ఫుడ్ పార్టీ ఇచ్చాడు. నా కోసం తన ఇంట్లో దాదాపు 15 రకాల వంటకాలు వండించాడు. నేను అన్నీ తినలేనని చెప్పాను. కొంచెం కొంచెం అన్నీ టేస్ట్ చేయమన్నాడు. చివర్లో నాకు 15 బాక్సుల నిండా స్వీట్స్ ఇచ్చాడు.”
రాధేశ్యామ్ లో ప్రభాస్ కు తల్లిగా నటించింది భాగ్యశ్రీ. ప్రభాస్ కు తల్లిగా ఆమె సెట్ అవుతుందా అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ డౌట్స్ తన వరకు కూడా వచ్చాయని, సినిమా చూసిన తర్వాత అందరి అనుమానాలు తీరిపోతాయని నమ్మకంగా చెబుతోంది భాగ్యశ్రీ.
తెలుగులో మహానటి, బాహుబలి, ఎవరు సినిమాలు చూశానని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. మంచి ఆఫర్లు వస్తే టాలీవుడ్ లో కొనసాగుతానని అంటోంది.