కొత్తగా పోలీస్ అధికారి వస్తే ఆయన ఆలోచనా విధానానికి అనుగుణంగా ట్రాఫిక్ నిబంధనలు మారుస్తారు. వన్ వే ను టూ వే చేస్తారు. టూ వే ను వన్ చేస్తారు. ప్రజలు భరించమే. ఆలయానికి కొత్త ఇవో వస్తే ఆయన చిత్తానికి క్యూ లైన్ల ను మారుస్తారు. ఆయన బదిలీ అయ్యేవరకు అంతే.
ఆంధ్రలో ఇప్పుడు పరిస్థితి అలాగే వుంది. జగన్ కు ప్రజలు అధికారం ఇచ్చారు. ఆయన అధికారంలో వున్నన్నాళ్లు ఆయనకు ఎలా నచ్చితే అలా వుండాల్సిందే. ఇలా ఎందుకు అని అడగడానికి లేదు.
శ్యామ్ సింగరాయ్ సినిమా వచ్చింది. ఆర్వో లు, ఎమ్మార్వోలు థియేటర్ల దగ్గర మోహరించారు. అదే అఖండ, బంగార్రాజు, డిజె టిల్లు సినిమాలు వచ్చాయి. ఎవ్వరూ పట్టించుకోలేదు. భీమ్లా నాయక్ సినిమా వస్తోంది మళ్లీ రూల్స్ రూళ్ల కర్ర బయటకు తీసారు. జగన్ కు బాకాలు ఊదే వారు…రూల్స్ పాటించాలి కదా..అంటూ సుద్దులు చెబుతున్నారు. మరి వీళ్లకు బంగార్రాజు, అఖండ, డిజె టిల్లు టైములో ఎందుకు రూల్స్ గాలికి వదిలేసారు అన్నది తెలియదు.
ప్రభుత్వం తనకు నచ్చిన నిబంధనలు పెట్టుకోవచ్చు. తప్పు లేదు. కానీ అందరికీ అదే రూలు వర్తింపచేయాలి అంతే కానీ నాగార్జున, బాలకృష్ణ లకు ఓ రూలు, పవన్ కళ్యాణ్ కు మరో రూలు కాదు. జనం గట్టిగా మాట్లాడనంత మాత్రాన వారికి పట్టనట్లు కాదు. జనం తిరుగుబాటు చేయనంత మాత్రాన వారు మౌనంగా వున్నారని కాదు.
పల్లెల్లో, పట్టణాల్లో కిందకు వెళ్తే జనం ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాను కావాలని తొక్కుతున్నారని జనం మాట్లాడే మాటలు వినిపిస్తాయి. అదనపు ఆటలు లేకపోవచ్చు. తక్కువ రేట్లే వుండొచ్చు. అవే అమలు చేయమంటున్నాం. మేమేమైనా కొత్త మాటలు చెబుతున్నామా అని ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రాతలు రాసేవాళ్లు రాసుకోవచ్చు. మరి అవే మాటలు మిగిలిన సినిమాల విడుదల వేళ ఎందుకు గుర్తుకు రాలేదు అని ఈ అక్షర వీరులు, శూరులు అడగరేమీ?
తప్పు జగన్ కు తెలిసి జరుగుతోందా? తెలియకుండా జరుగుతోందా? అన్నది కాదు ప్రశ్న. తప్పు జరుగుతోంది అని గమనించుకోవడం లేదు. కానీ జనం అంతా గమనిస్తున్నారు.