జనసేనాని, అగ్రహీరో పవన్‌కల్యాణ్ అభిమానులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ ప్రత్యర్థి పవన్‌కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని నిరసిస్తూ ఆయన అభిమానులు తిరుపతిలో రోడ్డెక్కారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో నిబంధనలపై థియేటర్లకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. భీమ్లానాయక్ సినిమాకు సంబంధించి అదనపు షోలు ప్రదర్శించకూడదని, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని థియేటర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ తమ ఆదేశాలను ధిక్కరించి బెనిఫిట్ షోల ప్రదర్శన, అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కఠిన హెచ్చరికలు చేసింది.
తమ నాయకుడి సినిమా విడుదలను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా నిబంధనలను తెరపైకి తెచ్చిందని పవన్ అభిమానులు గురువారం తిరుపతిలో ఆందోళనకు దిగారు. తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద పవన్ అభిమానులు మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. పవన్ సినిమాకు ఆంక్షలు విధించడం సరైంది కాదని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వ చర్యలు కక్ష సాధింపునకు నిదర్శనమని ఆరోపించారు. తమ నాయకుడు, హీరో అయిన పవన్ విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ వైసీపీ భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆయన అభిమానులు హెచ్చరించారు.