పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాగర్ చంద్ర.. భీమ్లానాయక్ కాంబినేషన్ ఇది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ఉంది. ఇంతలోనే మరో వార్త తెరపైకొచ్చింది. అతి త్వరలోనే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వబోతోందనేది ఆ ప్రచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ ప్రచారమే నిజం అవుతుంది కూడా.
ఆ మధ్య తమిళ్ లో వచ్చిన వినోదాయ సిత్తం అనే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీపుల్ మీడియా బ్యానర్ పై రాబోతున్న ఈ ప్రాజెక్టును త్రివిక్రమ్ కు అప్పగించిన విషయం తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియమ్ ను ఎలాగైతే భీమ్లానాయక్ గా మార్చాడో.. అలాగే వినోదాయ సిత్తం ను కూడా పవన్ స్టయిల్, ఇమేజ్ కు తగ్గట్టు మార్చమని త్రివిక్రమ్ ను కోరారు.
దాదాపు త్రివిక్రమ్ కూడా ఈ పనికి ఒప్పుకున్నాడు. ఓవైపు మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా పెండింగ్ లో ఉన్నప్పటికీ.. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు ఈ పని పూర్తిచేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చి.. టోటల్ ప్రాజెక్టును మరోసారి సాగర్ చంద్ర చేతిలో పెట్టాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్.
భీమ్లానాయక్ తో త్రివిక్రమ్-సాగర్ చంద్రకు మంచి అనుబంధం ఏర్పడింది. త్రివిక్రమ్ చెప్పిన మార్పుల్ని సాగర్ చేశాడు. సాగర్ చెప్పిన చిన్న చిన్న సవరణల్ని త్రివిక్రమ్ కూడా అంగీకరించాడు. అలా ఇద్దరి మధ్య ఓ అవగాహన ఉంది. కాబట్టి అదే సెటప్ ను వినోదాయ శితం రీమేక్ కు కూడా రిపీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇప్పుడీ ప్రాజెక్టులోకి జీ-స్టుడియోస్ సంస్థ కూడా ఎంటరైనట్టుంది.