ఇప్పటిదాకా సాగిన పాలన ఒక ఎత్తు, ఏప్రిల్ నుంచి మరో ఎత్తు అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గత మూడేళ్లుగా ఏపీలో జగన్ గొప్ప పాలన అందించారని, ఇక ఏప్రిల్ నుంచి మరింత సూపర్ గా పాలన సాగనుందని ఆయన జోస్యం చెప్పారు. మీరే చూస్తారుగా ఇంతకంటే మెరుగైన తీరులో ఏపీలో పాలన చేస్తామని ఆయన బల్ల గుద్ది చెబుతున్నారు.
కాకినాడ నుంచి విశాఖ దాకా ద్వారంపూడి కాలినడకన కిలోమీటర్ల దూరం అంతా కొలుస్తూ సింహాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు. జగన్ సీఎం అయితే అప్పన్నను కాలినడకన వచ్చి దర్శించుకుంటాను అని మొక్కుకున్నానని, ఇపుడు ఆ మొక్కు తీర్చుకోవడం జరిగింది అన్నారు. కరోనా వల్లనే మొక్కు తీర్చడం ఆలస్యం అయింది అని చెప్పారు.
గతంలో వైఎస్సార్ సీఎం కావాలని పాదయాత్ర చేసి అప్పన్నను దర్శించుకున్నానని గుర్తు చేశారు. గత మూడేళ్ళుగా కరోనా లాంటి విపత్తు వేళ కూడా ప్రజలకు మేలు చేస్తూ అన్ని వర్గాల బాగోగులు చూస్తున్న ఏకైన సీఎం జగన్ అని ద్వారంపూడి కొనియాడారు. ఆయనే మరింతకాలం ఏపీకి సీఎం గా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సుదీర్ఘ కాలం ఏపీకి సీఎం గా ఉండాలని అప్పన్నను మొక్కుకున్నట్లుగా ద్వారంపూడి చెప్పారు.
ఇదిలా ఉండగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగిన ద్వారంపూడి పాదయాత్ర వైసీపీకి కొత్త జోష్ తెచ్చింది. ఆయనతో పాటు పెద్ద ఎత్తున క్యాడర్ కూడా సింహాచలానికి కదలివచ్చింది. మొత్తానికి చూస్తే వైసీపీ నేతలకు పాదయాత్రలకు మధ్య మంచి సెంటిమెంట్ లింక్ ఏదో ఉన్నట్లుంది అనిపిస్తోంది.